ఈ రోజుల్లో సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు ఉండడం చాలా ప్రమాదకరంగా మారిపోతోంది. సినీ జనాలు మద్దతుగా నిలిచే రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉండేవాళ్లంతా ఒక్కటై వారి సినిమాలు వచ్చినపుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. రాజకీయంగా వారి వైఖరికి, వ్యక్తిగత అభిప్రాయాలకు సినిమాలకు ముడిపెట్టి టార్గెట్ చేయడం మామూలైపోతోంది. అధికారంలో ఉన్న, బలమైన పార్టీకి సపోర్ట్ ఇచ్చినా సరే.. వారిని టార్గెట్ చేయకుండా వదిలిపెడతారన్న గ్యారెంటీ ఏమీ లేదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎక్కడలేని మద్దతు ఇచ్చి ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసే క్రమంలో హద్దులు దాటి ప్రవర్తించిన కంగనా రనౌత్.. ‘ధకడ్’ సినిమాతో ఎంత ఘోరమైన పరాభవం ఎదుర్కొందో తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ మీద అమితాభిమానంతో ఆయన పేరుతో సినిమా చేసిన వివేక్ ఒబెరాయ్‌కి కూడా చేదు అనుభవం తప్పలేదు. ఈ అనుభవాలు చూశాక కూడా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కాషాయ రంగును పులిమేసుకుంటుండటం గమనార్హం.
విజయేంద్రకు రాజ్యసభ సభ్యత్వం దక్కడానికి పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఆయన నెత్తికెత్తుకుని మోయడం, వాటికి మద్దతుగా మాట్లాడడం కారణమన అందరికీ తెలుసు. ఈ పదవి వరించాక ఆయన మరింతగా తన లాయల్టీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ‘1770’ లాంటి సినిమాను నెత్తికెత్తుకోవడం హిందుత్వ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమే. అది చాలదన్నట్లు ఆర్ఎస్ఎస్ మీద నేరుగా ఓ సినిమా, వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
భాజపా నేత రామ్ మాధవ్ రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయనీ విషయం వెల్లడించారు. తనకు మూడేళ్ల ముందు వరకు ఆర్ఎస్ఎస్ అంటే ఏమీ తెలియదని.. దాని మీద సినిమా చేయాలన్న ఉద్దేశంతో మోహన్ భగవత్ తనను పిలిచి మాట్లాడారని.. దాని గొప్పదనం అప్పుడే తెలిసి, మరింతగా పరిశోధన చేసి ఒక సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా చేయాలని నిర్ణయించుుకున్నట్లు విజయేంద్ర వెల్లడించారు. ఐతే ఇలా నేరుగా ఆర్ఎస్ఎస్ గురించి ఎలివేషన్ ఇస్తూ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించడం ద్వారా విజయేంద్ర కాషాయాన్ని బాగా పులిమేసుకుంటున్నట్లే. ఇది ఆయన కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపినా చూపొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.