ఈ చెత్తను హీరోలు గమనిస్తున్నారా?

ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ అంటే.. థియేటర్ల దగ్గర ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు రిలీజైన సందర్భాల్లో మాత్రమే కనిపించేవి. అలాగే కొన్ని లో లెవెల్ మ్యాగజైన్లలో చిల్లర ఆర్టికల్స్ ఏవో రాసేవాళ్లు. అలాగే అభిమానులు పరస్పరం అవతలి హీరోలను కించపరుస్తూ కరపత్రాలు ప్రింట్ చేయించి పంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎప్పుడో ఒకసారి.. అది కూడా ఆఫ్ లైన్లో కనిపించేవి. కానీ గత పదేళ్లలో ఫ్యాన్ వార్స్ జరిగే తీరే మారిపోయింది.

ఇంటర్నెట్ విప్లవం తర్వాత సోషల్ మీడియాలో రోజు రోజుకూ ఫ్యాన్స్ వార్స్ శ్రుతి మించిపోతున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, చౌకగా ఇంటర్నెట్ లభిస్తుండటం, పనిలేని వాళ్లంతా సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతుండడంతో ఈ ఫ్యాన్స్ వార్స్ జుగుప్సాకరమైన స్థాయికి చేరున్నాయి. రెండో రోజుల కిందట మెగా ఫ్యామిలీకే చెందిన ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన హ్యాష్ ట్యాగ్ వార్.. ఇప్పటిదాకా టాలీవుడ్లో జరిగిన ఫ్యాన్ వార్స్ అన్నింట్లో అత్యంత దారుణమైనది, జుగుప్సాకరమైనది అని చెప్పాలి.

హీరోల వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయి ఇక్కడ ప్రస్తావించడానికి కూడా వీలుకాని స్థాయిలో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి లక్షల ట్వీట్లు వేశారంటే ఈ ఫ్యాన్ వార్స్ ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. వీటి వల్ల ఆయా హీరోలకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అయిన ఆ హ్యాష్ ట్యాగ్స్ గురించి సదరు హీరోలకు తెలియకుండా ఉండదు. వాళ్లు పట్టించుకోకున్నా.. పీఆర్వోలు అంతా గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా అందులో ఒక హీరోకు బలమైన పీఆర్ టీం ఉంది.

సోషల్ మీడియా ట్రెండ్స్‌ను వాళ్లు నిరంతరం ఫాలో అవుతూనే ఉంటారు. కొన్నిసార్లు అదేపనిగా ట్రెండ్స్ చేయించంలోనూ వాళ్లంతా సిద్ధహస్తులు. ఐతే ఇలాంటి నెగెటివ్ ట్రెండ్స్‌లో వారి ప్రమేయం ఉంటుందని అనుకోలేం. కానీ ఈ హీరోలు, వారి పీఆర్వోలు తలుచుకుంటే ఈ నెగెటివిటీని ఆపడం, తగ్గించడం కష్టమేమీ కాదు. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల మధ్య ఈ స్థాయి వైరం, సోషల్ మీడియాలో ఇంత నెగెటివిటీ ఎవ్వరికీ మంచిదికాదు. దీని వల్ల ఆ ఫ్యామిలీకే చెడ్డపేరు వస్తుంది. కాబట్టి హీరోలు, వాళ్ల పీఆర్వోలు జోక్యం చేసుకుని అభిమాన సంఘాల వారికి హెచ్చరికలు జారీ చేయడం, ఇలాంటి నెగెటివ్ ట్రెండ్స్‌కు అడ్డుకట్ట వేయడం చాలా అవసరం.