200 కోట్ల దోపిడీ.. తప్పని తెలిసినా ఇరుక్కున్న బ్యూటీ

దొంగ అని తెలిసి కూడాస్నేహం చేయ‌డం.. ఆ దొంగ సొమ్ములో వాటాను పంచుకోవ‌డం.. వంటివి ఆ హీరోయిన్‌కు అర‌దండాలు ప‌డేలా చేశాయి. మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఉచ్చు బిగిస్తోంది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును చేర్చింది.

దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
సుకేశ్ చంద్ర శేఖర్‌ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినప్పటికీ అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారని, దోపిడీ సొమ్ములో వాటా కూడా తీసుకున్నార‌ని సదరు వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌.. ఇలా దాదాపు రూ.10కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్‌, ఆమె కుటుంబసభ్యులకు సుకేశ్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది.

సుకేశ్‌తో నటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ విచారణలో తేలినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ పలుమార్లు ఆమెకు సమన్లు జారీ చేసింది. ఆ మధ్య జాక్వెలిన్ విదేశాలకు వెళ్లకుండా లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దీనిపై ఆమె కోర్టుకు వెళ్లగా.. విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. మరోవైపు, కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్‌ చేసుకున్నారు.

ఇందులో రూ.7 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే ఉన్నాయి. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్చంద్రశేఖర్. తర్వాత బెయిల్‌ విషయాన్ని దాటవేస్తుండటంతో.. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు 2021లో సుకేశ్‌ను అరెస్టు చేశారు. అయితే.. జైల్లో నుంచి కూడా సుకేశ్ తన నేరాలను కొనసాగించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. అతడిని కలిసేందుకు పలువురు బాలీవుడ్‌ సెలెబ్రిటీలు జైలుకు వచ్చినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.