సినిమాకు కష్ట కాలం నడుస్తోంది.. థియేటర్లకు జనాలు రావట్లేదు అంటూ రెండు వారాల ముందు వరకు టాలీవుడ్ జనాలంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రోజు రోజుకూ థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ తగ్గిపోతుండడం, కొత్త చిత్రాలు రిలీజైన తొలి వీకెండ్లో కూడా థియేటర్లు నిండకపోవడంతో సినిమాల మనుగడ ఎలా అనే ప్రశ్న తలెత్తింది. కానీ కంటెంట్ ఉండి, టికెట్ల ధరలు అందుబాటులో ఉంటే జనాలు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చి సినిమాలుచూస్తారన్న భరోసాని గత రెండు వారాల్లో రిలీజైన సినిమాలు రుజువు చేశాయి.
ఆగస్టు తొలి వారం బింబిసార, సీతారామం అద్భుత స్పందన తెచ్చుకోగా.. రెండో వారం కార్తికేయ-2 సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. సోమవారం ఇండిపెండెన్స్ డే సెలవును పూర్తిగా ఉపయోగించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఉత్తరాదిన కూడా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా జోరు తగ్గించట్లేదు.
మంగళవారం సెలవు రోజు కాదు. పైగా వీక్ డే. మామూలుగా అయితే ఈ రోజు బాక్సాఫీస్ డల్లుగా ఉంటుంది. కానీ కార్తికేయ-2 మాత్రం వీక్ డేలో చాలా స్ట్రాంగ్‌గా నిలబడింది. మార్నింగ్ షో, మ్యాట్నీలకు ఓ మోస్తరు స్థాయిలో వసూళ్లు రాగా.. ఈవెనింగ్, నైట్ షోలకు చాలా వరకు హౌస్ ఫుల్స్ పడిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే చాలా వరకు షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో నడిచాయి.
వాకిన్స్ కూడా కలుపుకుంటే మెజారిటీ థియేటర్లు హౌస్ ఫుల్స్‌తో రన్ అయినట్లే. మంగళవారం కూడా సినిమాకు మంచి షేర్ గ్యారెంటీ అన్నది స్పష్టం. హిందీలో ఈ చిత్రానికి రోజు రోజుకు థియేటర్లు, వసూళ్లు పెరుగుతున్నాయి. అక్కడ కూడా సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. ఈ వారాంతంలో చెప్పుకోదగ్గ కొత్త సినిమాలేవీ లేకపోవడంతో ఇటు తెలుగులో, అటు హిందీలో కార్తికేయ-2 దుమ్ముదులిపేలా కనిపిస్తోంది. అంతిమంగా సినిమా పెద్ద రేంజికే వెళ్లేలా ఉంది.