సింగల్ స్క్రీన్ల అడ్డా హైదరాబాద్

మల్టీప్లెక్సులు వచ్చాక సీటింగ్ కెపాసిటీలు తగ్గిపోయి ఇంట్లోనే పెద్ద తెర కట్టుకుని సౌండ్ బార్ తో చూస్తున్న ఫీలింగ్ వస్తోంది కానీ ఒకప్పుడు విశాలమైన పెద్ద హాలు, వందల సంఖ్యలో సీట్లు, మూడు నాలుగు తరగతులు, రెండు కళ్ళు సరిపోవనేలా అదిరిపోయే పెద్ద స్క్రీన్ అప్పట్లో ఆ వైభవం వేరుగా ఉండేది. ఇప్పట్లా పైరసీలు, ఆన్ లైన్ టొరెంట్లు లేని కాలం కాబట్టి సగటు మనిషికి వినోదమంటే సినిమా హాలుకు వెళ్లడమే మొదటి ప్రాధాన్యంగా ఉండేది.

ఈ మార్పులు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా వచ్చాయి కానీ అత్యధిక సీటింగ్ ఉన్న థియేటర్లు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇండియాలో 1626 సీట్లతో మొదటి స్థానం అసన్ సోల్ లో ఉన్న మనోజ్ టాకీస్ ది. రెండోది హైదరాబాద్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం. ఇందులో ఒకేసారి 1323 ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చు.

తర్వాతి ప్లేస్ ఇదే నగరంలో రంగది. దీంట్లో 1306 సీట్లున్నాయి. దేవి సెవెంటీ ఎంఎం కూడా ఇదే కౌంట్. కేవలం ఏపి తెలంగాణ మాత్రమే చూసుకుంటే భుజంగ 1292, సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం 1216, విశ్వనాధ్ 1177, శ్రీరాములు 1152, సప్తగిరి 1150, సంధ్య థర్టీ ఫైవ్ 1055, సాయిరంగ 1055 సీట్లతో అన్నీ భాగ్యనగరంలోనే కొలువు తీరాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైజాగ్ లో ఉన్న జగదాంబ సెవెంటీ ఎంఎం మాత్రమే 1016 సీట్లతో టాప్ 20లో ఉంది.

ఇది తప్ప వెయ్యి దాటిన సింగల్ స్క్రీన్లు ఇంకెక్కడా లేవు. మన పక్క రాష్ట్రాల్లో చూస్తే చెన్నైలో రెండు, బెంగుళూరులో మూడు మాత్రమే సహస్ర సింహాసనాలు ఉన్న థియేటర్లున్నాయి. వాణిజ్య రాజధాని ముంబైలో ఉన్నవి కూడా మూడే. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్ల ఆధిపత్యం, వాటి పట్ల ఆడియన్స్ చూపిస్తున్న మక్కువ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇంతకు ముందు వీటి సంఖ్య ఇంకా భారీగా ఉండేది కానీ ఇప్పుడు మిగిలిన వాటినైనా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది.