RRR కు ఆస్కార్.. డైరెక్టర్ ధీమా

రాజమౌళి ‘బాహుబలి’తో పోలిస్తే ‘ఆర్ఆర్ఆర్’ అంత గొప్ప సినిమా ఏమీ కాదన్నది మెజారిటీ భారతీయ ప్రేక్షకుల అభిప్రాయం. తెలుగు ప్రేక్షకులను అడిగితే ‘మగధీర’ స్థాయికి కూడా ఇది రాదని అంటారు. జక్కన్న దీని కంటే ముందే తీసిన ఆ రెండు భారీ చిత్రాల స్థాయిలో ఇది మన ఆడియన్స్‌ను సంతృప్తిపరచలేదు. కొంత మేర అసంతృప్తిని మిగిల్చింది ఆ చిత్రం. ఐతే ఈ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో డిజిటల్‌గా రిలీజయ్యాక ‘ఆర్ఆర్ఆర్’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అమెరికన్లయితే సినిమా చూసి ఫిదా అయిపోయారు. వారి స్పందన చూసి మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ను యుఎస్‌లో రీ రిలీజ్ చేస్తే వెర్రెత్తిపోయి చూశారు. సాధారణ ప్రేక్షకుల మాత్రమే కాదు.. హాలీవుడ్ ఫిలిం మేకర్స్, ఆర్టిస్టులు కూడా ఈ సినిమా చూసి ఎంత కొనియాడారో తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డుల్లోనూ ప్రభావం చూపొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖ దర్శక నిర్మాత, హాలీవుడ్ ఫిలిం మేకర్స్‌తో పాటు ఆస్కార్ జ్యూరీ వాళ్లతో మంచి కనెక్షన్ ఉన్న అనురాగ్ కశ్యప్ స్వయంగా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ సాధించే విషయమై ధీమా వ్యక్తం చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ వాళ్లకు విపరీతంగా నచ్చేసిందని.. కాబట్టి భారత్ తరఫున ఈ సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేయడమే మనం చేయాల్సిందని అనురాగ్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు.

ఇండియా నుంచి ‘ఆర్ఆర్ఆర్’ నామినేట్ అయితే మాత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఆనురాగ్ చెప్పాడు. ఆ చిత్రం టాప్-5 నిలవడం మాత్రం గ్యారెంటీ అని చెప్పాడు అనురాగ్. బాక్సాఫీస్ సక్సెస్ సంగతి పక్కన పెడితే.. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా సినిమాలు తీస్తూ భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా అనురాగ్‌కు మంచి పేరుంది. ఆస్కార్ అవార్డులు ఎలాంటి చిత్రాలకు ఇస్తారో, వాళ్లు ఏం పరిగణనలోకి తీసుకుంటారో అతడికి బాగా తెలుసు. అలాంటి ఫిలిం మేకర్ చెప్పాడంటే ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డు అందుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.