ప్రభాస్ ట్రిపుల్ ధమాకా

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి ఏదో ఊహించుకుంటే ఇంకేదో జరిగింది. సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి నిరాశ పరిచాయి. కనీసం సాహోకు ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. అందులో యాక్షన్ అయినా ఆకట్టుకుంది. కానీ రాధేశ్యామ్ అన్ని రకాలుగా తీవ్ర నిరాశకు గురి చేసింది. దీంతో ప్రభాస్ అభిమానుల బాధ అంతా ఇంతా కాదు. ఇక ప్రభాస్ తర్వాతి మూడు చిత్రాల మీద అభిమానుల్లో ఆశలు బాగానే ఉన్నాయి.

వాటి కథాంశాలు.. బడ్జెట్లు అన్నింట్లోనూ భారీతనం కనిపిస్తోంది. వాటి దర్శకుల మీద అందరిలోనూ భరోసా ఉంది. ఈ చిత్రాల విడుదల విషయంలోనూ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. ఇప్పటికే ‘ఆదిపురుష్’ను 2023 సంక్రాంతికి షెడ్యూల్ చేయడం తెలిసిందే. ఆ తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేనట్లే. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శక నిర్మాత ఓం రౌత్.. ఇటీవలే సంక్రాంతి విడుదలను మరోసారి ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడిక ‘సలార్’ సంగతి తేలిపోయింది. ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చేశారు. ముందు 2023 వేసవికి అన్నారు కానీ.. అది అసాధ్యం అని ఎప్పుడో తేలిపోయింది. తాజాగా 2023 సెప్టెంబరు 28న ‘సలార్’ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. రెండు కత్తులు పట్టుకుని రక్తపాతం సృష్టించి ప్రశాంత్ నీల్ మార్కు హీరోలా దూసుకొస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ‘సలార్’కు రెండు రిలీజ్ డేట్లు మారాయి. ఈసారి మాత్రం డేట్ మారదని ఫిక్సయిపోవచ్చు. ప్రశాంత్ విజన్లో ప్రభాస్ విలయతాండవం చేస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం గ్యారెంటీనే.

‘ఆదిపురుష్’ రిలీజ్ అయిన ఎనిమిది నెలలకు ‘సలార్’ రంగంలోకి దిగనుండగగా.. ఇంకో ఆరు నెలలకు ‘ప్రాజెక్ట్-కే’ వచ్చే అవకాశముంది. ఆ చిత్రాన్ని 2024 సంక్రాంతికి అనుకుంటున్నారు. ఇప్పటికే ఆ చిత్ర షూటింగ్ 55 శాతం పూర్తయినట్లు నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2023 అక్టోబర్లో లేదా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. ‘సలార్’ సెప్టెంబరులో వస్తుంది కాబట్టి అక్టోబర్లో ‘ప్రాజెక్ట్-కే’ రాదు. కాబట్టి 2024 సంక్రాంతికి ఫిక్సయిపోవచ్చు. అంటే ఏడాది వ్యవధిలో ప్రభాస్ ట్రిపుల్ ధమాకా చూడబోతున్నామన్నమాట.