‘అర్జున్ రెడ్డి’ మధ్యలో ఆపేసిన పూరి

‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంతటి సంచలనమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా చూడడం మొదలుపెడితే ఇక ఆపడం కష్టమే. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఆ చిత్రాన్ని ఆపకుండా చూసేస్తాం. ఐతే దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం ఆ సినిమాను 45 నిమిషాలు చూసి ఆపేశాడట. అందుక్కారణం విజయ్ దేవరకొండే అంటున్నాడాయన. వరంగల్‌లో జరిగిన ‘లైగర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పూరి మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించాడు.

వరంగల్‌లో జరిగిన ‘లైగర్’ ప్రి రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్లో పూరి ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్ తండ్రి గోవర్ధన్ తనకు ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్ అని, విజయ్‌తో తాను సినిమా చేయాలని అనుకున్నపుడు అతణ్ని తనకు అప్పగిస్తూ.. కొడుకులా చూసుకోమని, తనతో మంచి సినిమా తీయమని చెప్పాడని పూరి వెల్లడించాడు. కానీ తాను అతణ్ని తండ్రిలా చూసుకోవడం కాకుండా.. అతనే తనను ఒక తండ్రిలాగా జాగ్రత్తగా చూసుకున్నాడని, అన్ని విషయాల్లో సపోర్ట్‌గా నిలిచాడని పూరి వ్యాఖ్యానించాడు.

విజయ్ లాంటి హీరోను తాను చూడలేదని.. అతణ్ని తొలిసారి అర్జున్ రెడ్డి సినిమాలో చూసి షాకయ్యానని పూరి తెలిపాడు. కొత్త కొత్త డైరెక్టర్లు.. మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. సందీప్ రెడ్డి విజయ్ అనే కుర్రాడు
‘‘ఒకసారి మా ఆవిడ కొత్త కొత్త దర్శకులు మంచి మంచి సినిమాలు చూస్తున్నారు. మీరు వెనుకబడి పోతున్నారు. వేరే వాళ్ల సినిమాలు చూడండి అని చెప్పింది. ఏం సినిమా చూడాలి అంటే సందీప్ రెడ్డి వంగ అనే కొత్త దర్శకుడు, విజయ్ అనే యంగ్ హీరో కలిసి చేసిన ‘అర్జున్ రెడ్డి’ చూడండి. నేను, నా కూతురు ఆ సినిమాను మూడుసార్లు చూశాం అంది. సరే అని అర్జున్ రెడ్డి చూడడం మొదలు పెట్టా. అందులో డైరెక్షన్ బాగుంది. స్టోరీ బాగా వెళ్తోంది. ఐతే 45 నిమిసాలు చూసి ఆ సినిమాను ఆపేశాను. తర్వాత ఏమైందో తెలుసుకోవాలని లేదు. నా దృష్టి ఆ కుర్రాడి మీద ఆగిపోయింది. ఇంత నిజాయితీగా చేస్తున్నాడు ఎవరితను అనుకున్నా. తనతో కచ్చితంగా సినిమా చేయాలనుకున్నా. విజయ్‌లో నాకు బాగా నచ్చేది తన నిజాయితీనే.

బయట తన మాటల్లోనే కాదు.. తన నటనలోనూ నిజాయితీ ఉంటుంది. సినిమాలో తనకు ఎంత ఎలివేషన్ పెట్టినా.. ఎన్ని షాట్లు తీసినా.. పొగరు కనిపించదు. అతనేం చేసినా నిజాయితీగా ఉంటుంది. తన కోపమైనా సరే. నాకోసం కష్టాల్లో తోడుగా నిలబడ్డాడు. తనకు పారితోషకం కింద డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు సినిమా కోసం ఖర్చు పెట్టమంటాడు. అప్పులుంటే వాటిని తీర్చమంటాడు. వాళ్ల నాన్న నేను స్నేహితులం. ఈ సినిమా షూటింగ్‌కు ముందు ఆయన నాతో విజయ్‌ని కొడుకులా చూసుకోమన్నాడు. కానీ విజయ్ నన్ను వాళ్ల నాన్నలా చూసుకున్నాడు. ఛార్మితో కలిసి అతను సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. విజయ్ లాంటి హీరోను నేను ఇంత వరకు చూడలేదు’’ అని పూరి చెప్పాడు.