ఇండియన్ ఫిలిం హిస్టరీలో బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ‘దృశ్యం-2’ పేరు కచ్చితంగా ఉంటుంది. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రదాన పాత్రలో జీతు జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం 2014లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ సమయానికి మలయాళంలో రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం అదే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తే ప్రతి చోటా సూపర్ హిట్ అయింది. ‘దృశ్యం’ చిత్రాన్ని మెచ్చి చైనా, శ్రీలంక దేశాల్లో కూడా దీన్ని రీమేక్ చేసి సక్సెస్ సాధించడం విశేషం.
ఈ చిత్రానికి ఆరేళ్ల తర్వాత సీక్వెల్ తీస్తే.. పెద్దగా హడావుడి లేకుండా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఫస్ట్ పార్ట్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో థ్రిల్స్ ఇవ్వడంతో సినిమాకు ఓటీటీలోనే బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ఈ చిత్రం రిలీజైన తర్వాత ఇంకో భాగం తీసే అవకాశాలున్నట్లు చూచాయిగా చెప్పిన దర్శకుడు జీతు జోసెఫ్.. పెద్దగా ఆలస్యం చేయకుండా సీక్వెల్ ప్రకటించేశాడు.
దృశ్యం తర్వాత దృశ్యం-2 రావడానికి ఆరేళ్లు పట్టింది కానీ.. సెకండ్ పార్ట్ తర్వాత మూడో పార్ట్ రావడానికి రెండేళ్లకు మించి టైం పట్టేలా లేదు. శనివారమే సినిమాను అనౌన్స్ చేయగా.. మోహన్ లాల్, జీతుల స్పీడ్ గురించి తెలిసిందే కాబట్టి కొన్ని నెలల్లోనే సినిమా రెడీ అయిపోవచ్చు. ఈ ఏడాది చివర్లోనో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలోనో సినిమా రిలీజయ్యే అవకాశముంది. ‘దృశ్యం-2’ను కొవిడ్ పరిస్థితుల్లో తప్పక ఓటీటీలో రిలీజ్ చేశారు.
ఆ సినిమా చూసిన జనాలు.. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన సినిమా కదా అని ఫీలయ్యారు. ఇప్పుడు థియేటర్లు బాగానే నడుస్తున్నాయి కాబట్టి మూడో పార్ట్ కచ్చితంగా థియేటర్లలో వచ్చే అవకాశముంది. వివిధ భాషల్లో సినిమాకు మంచి క్రేజ్ రావడం గ్యారెంటీ. ఈసారి మలయాళంకు పరిమితం చేయకుండా వివిధ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని లాల్ అభిమానులు కోరుకుంటున్నారు. దృశ్యం-3కి క్యాప్షన్‌గా ‘ది కంక్లూజన్’ పెట్టిన నేపథ్యంలో ఈ సిరీస్‌లో ఇదే చివరి సినిమా అన్నది స్పష్టం. మరి ఈ కథకు జీతు ఎలాంటి ముగింపునిస్తాడో చూడాలి.