నెగెటివ్ సెంటిమెంట్.. బ్రేక్ చేస్తుందా?

హాలీవుడ్, బాలీవుడ్లో మాదిరి తెలుగులో సీక్వెల్, ఫ్రాంఛైజీ సినిమాలు తీయ‌డ‌మూ త‌క్కువ‌. అవి ఆడ‌డ‌మూ త‌క్కువే. మనీ, గాయం, శంక‌ర్ దాదా, చంద్రముఖి, మంత్ర, కిక్, ఆర్య‌, వెన్నెల, గ‌బ్బ‌ర్ సింగ్, మ‌న్మ‌థుడు.. ఇలా ఈ కోవలో ఎన్నో సినిమాలు కనిపిస్తాయి. వీటి సీక్వెల్స్‌లో మనీ మనీ, ఆర్య 2, శంకర్ దాదా జిందాబాద్ లాంటి కొన్ని చిత్రాలు పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ, అంచనాలు అందుకోలేకపోవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్నందుకోలేకపోయాయి.

మిగతా సినిమాలు మరీ పేలవంగా ఉండడంతో ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇటీవలే ‘ఎఫ్-2’ సీక్వెల్ ‘ఎఫ్-3’ రిలీజ్ కాగా.. అందులో హడావుడి తప్ప విషయం లేకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ చెందారు. ఐతే సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల ట్రాక్ రికార్డు ఇంత పేలవంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ కోవలో ఇంకో సినిమా వస్తోంది. అదే.. కార్తికేయ-2. ఎనిమిదేళ్ల కిందట చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘కార్తికేయ’కు సీక్వెల్ ఇది.

‘కార్తికేయ’ రిలీజైనపుడే సీక్వెల్ గురించి సంకేతాలు వచ్చాయి కానీ.. ఇది కార్యరూపం దాల్చి, సినిమా పూర్తయి, ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పట్టేసింది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈసారి బడ్జెట్ సహా అన్నీ పెరిగినట్లే ఉన్నాయి. దేశవ్యాప్తంగా భారీ లొకేషన్లలో సినిమా తీసినట్లున్నారు. కథలోనూ భారీతనం కనిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ అన్నింట్లోనూ భారీతనం కనిపిస్తోంది. ఐతే ఇవన్నీ కూడా అదనపు హంగులే తప్ప సినిమాను ఆడించేసేవి కావు.

అన్నింటికంటే ముఖ్యం.. ‘కార్తికేయ’లో మాదిరి బలమైన, ఆసక్తికర కథాకథనాలు ఉండాలి. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయాలి. కొత్త అనుభూతిని పంచాలి. ‘కార్తికేయ’ తర్వాత ‘సవ్యసాచి’తో తీవ్రంగా నిరాశ పరిచిన చందు మొండేటి ఈసారి ఒక కసితో స్క్రిప్టు రాసి సినిమా తీసి ఉంటాడని ఆశించవచ్చు. అతడి విజన్‌కు తగ్గట్లుగా నిఖిల్ కష్టపడ్డాడు. నిర్మాతలు రాజీ లేకుండా అన్నీ సమకూర్చారు. మరి వాటిని ఉపయోగించుకుని అతను సరైన సినిమా తీశాడా.. సీక్వెల్స్ అచ్చిరావన్న టాలీవుడ్ నెగెటివ్ సెంటిమెంటును బ్రేక్ చేశాడా.. అన్నది ఈ శనివారం తేలిపోతుంది.