తెలుగు సినిమా ప్రస్థానంలో అతి గొప్ప మైలురాయిగా చెప్పుకునే సినిమా అన్న నందమూరి తారకరామారావు నటించిన దానవీరశూర కర్ణ. సుమారు నాలుగు గంటల నిడివితో రూపొందిన ఈ మాస్టర్ పీస్ 1977లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం పది లక్షల లోపే బడ్జెట్ తో రూపొంది కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ బ్లాక్ బస్టర్ నమోదు చేసిన రికార్డుల గురించి చెప్పుకుంటూ పొతే ఓ పెద్ద పుస్తకమే అవుతుంది.
ఎన్టీఆర్ మూడు పాత్రలు చేయడమే కాదు దర్శకత్వం కూడా వహించడం చరిత్ర మరువని సాహసం. ఇప్పుడు దీనికి పోకిరికి లింక్ ఏమై ఉంటుందనేగా మీ ప్రశ్న. అక్కడికే వద్దాం. డివిఎస్ కర్ణని 1994లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. కటవుట్లు, దండాలు, అభిమానుల ఊరేగింపులు, తెల్లవారుఝామున స్పెషల్ షోలతో చాలా రచ్చ జరిగింది. 17 ఏళ్ళ తర్వాత విడుదలైన పాత చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు 60 లక్షలకు కొనుగోలు చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ.
వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ మళ్ళీ కోటి రూపాయలకు పైగా వసూలు చేయడం ఇప్పటికీ ఏ సినిమా అందుకోలేకపోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత హిస్టరీ రిపీట్ అయ్యింది. నిన్న కేవలం సాయంత్రం మాత్రమే వేసిన పోకిరి స్పెషల్ ప్రీమియర్లకు భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్న ఒక్క ఆర్టిసి క్రాస్ లోనే 6 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ రావడం మాములు విషయం కాదు.
మొత్తం రెండు వందలకు పైగా జరిగిన వరల్డ్ వైడ్ స్క్రీనింగ్స్ చూసుకుంటే ఈ మొత్తం మూడు కోట్లకు పైగానే ఉంటుందని ట్రేడ్ అంచనా. ఓ రెండు రోజుల్లో ఆ లెక్కలూ బయటికి వస్తాయి. మొత్తానికి దానవీరశూరకర్ణ తర్వాత ఘరానా మొగుడు, తొలిప్రేమ లాంటివి చాలా రీ రిలీజులు జరుపుకున్నాయి కానీ ఆ స్థాయిలో ప్రభంజనం రికార్డులు సృష్టించింది మాత్రం ఖచ్చితంగా పోకిరిలో పండుగాడే.