ఈ నిర్మాత‌ల్ని ఎంత పొగిడినా త‌క్కువే

స్వ‌ప్న ద‌త్, ప్రియాంక ద‌త్‌.. ఇప్పుడు టాలీవుడ్లో ప్ర‌శంస‌ల జ‌ల్లులో త‌డిసి ముద్ద‌వుతున్న నిర్మాత‌లు వీళ్లు. లెజెండ‌రీ ప్రొడ్యూస‌ర్, వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వినీద‌త్ కూతుళ్లే వీళ్లిద్ద‌రూ అన్న సంగ‌తి తెలిసిందే. శ‌క్తి స‌హా కొన్ని డిజాస్ట‌ర్ల దెబ్బ‌కు ఒక ద‌శ‌లో నిర్మాణం ఆపేయాల్సిన స్థితికి చేరిన అశ్వినీద‌త్‌కు అండ‌గా నిలిచింది కూతుళ్లే.

స్వ‌ప్న సినిమాస్ అని కొత్త‌గా బేన‌ర్ పెట్టి ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం లాంటి చిన్న సినిమాల‌తో ప్ర‌స్థానం మొద‌లుపెట్టి నెమ్మ‌దిగా సినిమాల స్థాయి పెంచుకుంటూ మ‌హాన‌టి లాంటి అద్భుత‌మైన సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. ఈ సినిమాతో వైజ‌యంతీ మూవీస్ పేరు మ‌ళ్లీ మార్మోగేలా చేశారు. గ‌త ఏడాది జాతి ర‌త్నాలు మూవీతో క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్ అందుకున్న స్వ‌ప్న‌, ప్రియాంక‌.. ఇప్పుడు సీతారామం సినిమాతో మ‌రోసారి త‌మ అభిరుచిని చాటారు. క‌మ‌ర్షియ‌ల్‌గానూ మంచి ఫ‌లితం అందుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

సీతారామంకు ముందు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ప‌రిస్థితి తెలిసిందే. అత‌ను చివ‌ర‌గా తీసిన ప‌డి ప‌డి లేచె మ‌న‌సు పెద్ద డిజాస్ట‌ర్. అంత‌కుముందు లై లాంటి మరో డిజాస్ట‌ర్ తీశాడ‌త‌ను. ఇలాంటి ట్రాక్ రికార్డును న‌మ్మి, ప‌ర‌భాషా హీరో హీరోయిన్ల‌ను పెట్టి రూ.40 కోట్ల బ‌డ్జెట్లో సినిమా తీయాలంటే ఎంత గ‌ట్స్ ఉండాలి. ఏమాత్రం రాజీ లేకుండా అత్యుత్త‌మ సాంకేతిక నిపుణ‌ల్ని స‌మ‌కూర్చి, చాలా క‌ష్ట‌మైన లొకేష‌న్ల‌లో, బాగా ఖ‌ర్చు పెట్టి సినిమా తీయ‌డం, ద‌ర్శ‌కుడు కోరిందంతా స‌మ‌కూర్చ‌డం అంద‌రు నిర్మాత‌లూ చేయ‌లేరు.

హ‌ను ప్ర‌తిభ‌ను, అత‌డి క‌థ‌లోని స‌త్తాను న‌మ్మి, త‌న విజ‌న్‌కు త‌గ్గ‌ట్లుగా ఇలా రాజీ లేకుండా సినిమాను నిర్మించే నిర్మాత‌లు దొర‌క‌డం నిజంగా అత‌డి అదృష్ట‌మే. వాళ్లు హ‌నును న‌మ్మి త‌న విజ‌న్‌కు వెండితెర రూపం ఇచ్చారు కాబ‌ట్టే తెలుగు ప్రేక్ష‌కులు ఈ రోజు అద్భుత‌మైన సినిమా చూసే అవ‌కాశం ద‌క్కింది. తెలుగు సినిమాకు కూడా సీతారామం గ‌ర్వకార‌ణంగా నిలుస్తోంది. ఇందుకు ద‌త్ కూతుళ్ల‌ను ఎంత అభినందించినా త‌క్కువే.