కరణ్ షో.. తాప్సీ స్టన్నింగ్ పంచ్

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఏళ్ల పాటు టీవీలో కొనసాగిన ఆ షో.. ఇప్పుడు ఓటీటీకి మారింది. హాట్ స్టార్‌లో కొత్త సీజన్ ప్రసారం అవుతోంది. ఇందులో కరణ్ ఎప్పుడో బోల్డ్ ప్రశ్నలే అడుగుతుంటాడు. ముఖ్యంగా సెక్స్ గురించే ప్రశ్నలు తిరుగుతుంటాయి.

ఓటీటీకి మారేసరికి ఇందులో ఇలాంటి ప్రశ్నలు మరీ ఎక్కువ అయిపోయాయని.. షో మరీ జుగుప్సాకరంగా తయారైందని విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కరణ్‌లో మార్పు ఏమీ లేదు. జాన్వి కపూర్-సారా అలీ ఖాన్, విజయ్ దేవరకొండ-అనన్య పాండేలతో నిర్వహించిన ఎపిసోడ్లలో ప్రశ్నలు మరీ శ్రుతి మించిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ షో మీద బాలీవుడ్ అగ్ర కథానాయిక తాప్సి తనదైన శైలిలో వేసిన పంచ్ చర్చనీయాంశం అవుతోంది.

కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నా, దాని టీం మెంబర్స్ ‘కాఫీ విత్ కరణ్’ షోకు వెళ్లి ప్రమోట్ చేయడం మామూలే. ఆగస్టు 19న తాప్సి సినిమా ‘దోబారా’ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మీరు ‘కాఫీ విత్ కరణ్’ షోకు వెళ్లరా అని మీడియా వాళ్లు తాప్సిని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘‘కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేలా నాసెక్స్ లైఫ్ అంత గొప్పగా ఏమీ లేదు’’ అని బదులిచ్చింది. ఈ ఆన్సర్ తాప్సి.. కరణ్‌కు మామూలు పంచ్ ఇవ్వలేదని నెటిజన్లు ఆమెను కొనియాడుతున్నారు.

ఈ షోలో ఎప్పుడూ సెక్స్‌కు సంబంధించిన ప్రశ్నలే కరణ్ అడుగుతుంటాడనే అర్థం వచ్చేలా తాప్సి మాట్లాడిందని.. నేరుగా షో గురించి ఏమీ అనకుండా ఈ పంచ్‌తో అదరగొట్టేసిందని ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఐతే ఇలాంటి వాటికి కరణ్ ఇప్పటి దాకా పెద్దగా స్పందించింది లేదు. తన తీరు మార్చుకున్నది లేదు. మరి తాప్సి వేసిన పంచ్‌తో అయితే తన షో పట్ల మామూలు జనాల్లోనే కాదు.. ఇండస్ట్రీ వాళ్లలో కూడా ప్రతికూల అభిప్రాయం ఉందని, తాను మరీ శ్రుతి మించుతున్నానని కరణ్ అర్థం చేసుకుంటే బాగుంటుందేమో.