రెండు దశాబ్దాల నుంచి సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉంటున్నాడు దిల్ రాజు. ఐతే నిర్మాతగా పెద్ద రేంజికి వెళ్లినా.. ఆయన డిస్ట్రిబ్యూషన్ మాత్రం వదులుకోలేదు. ఆయన ఇండస్ట్రీలో ఎదిగిందే డిస్ట్రిబ్యూషన్లోనే. అందుకే సినిమాలు నిర్మిస్తూనే సమాంతరంగా డిస్ట్రిబ్యూషన్ కొనసాగించారు. ఏ సినిమా ఆడుతుందో, ఏది ఆడదో సరిగ్గా చూసుకుని చాలా తెలివిగా పంపిణీ హక్కులు తీసుకుంటూ ఉంటాడని రాజుకు మంచి పేరుంది.
ఇటీవల నిర్మాతగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నా రాజుకు ఇబ్బంది లేకపోవడానికి డిస్ట్రిబ్యూషన్ ద్వారా వస్తున్న లాభాలే. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాలను పంపిణీ చేసి మంచి లాభాలందుకున్నారాయన. ఇప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా మరో జాక్ పాట్ కొట్టాడు ‘బింబిసార’ రూపంలో. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసింది రాజే.
నాలుగున్నర కోట్లకు నైజా హక్కులు కొని రిలీజ్ చేశాడు రాజు. ఈ చిత్రం కేవలం వీకెండ్లోనే ఈ ఏరియాలో రూ.5.66 కోట్ల షేర్ రాబట్టింది. అంటే వీకెండ్లోనే కోటి రూపాయలకు పైగా లాభం అన్నమాట. సోమవారం కూడా సినిమా బలంగానే నిలబడింది. ఇంకా చాలా రోజులు ఆడేలా ఉంది. దిల్ రాజు పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఉత్సాహంలోనే ఆదివారం రాజు ‘బింబిసార’ టీంకు తనే ప్రత్యేకంగా పార్టీ కూడా ఇచ్చాడు.
కళ్యాణ్ రామ్‌తో రాజుకు ఎప్పుడూ కలిసి వస్తూనే ఉంది. అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘పటాస్’ సినిమాను రిలీజ్‌కు ముందు చూసి బాగా ఇంప్రెస్ అయి మొత్తంగా సినిమాను కొనేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడాయన. ఆ చిత్రం ఆయనకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ‘118’ సినిమాను సైతం నైజాం ఏరియాలో రిలీజ్ చేసింది దిల్ రాజే. ఇప్పుడు ‘బింబిసార’తో ఆయన మరోసారి జాక్ పాట్ కొట్టాడు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ అందరు బయ్యర్లనూ ఆల్రెడీ సేఫ్ జోన్లోకి తెచ్చేసింది. వీకెండ్ తర్వాత వస్తున్న ఆదాయమంతా లాభమే.