బింబిసార, సీతారామం.. అదే ప్లస్

జూన్ తొలి వారంలో ‘మేజర్’, ‘విక్రమ్’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాక తెలుగులో ఒక్కటంటే ఒక్క సక్సెస్ లేదు. ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. దేనికీ సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. మామూలుగా మాస్ రాజా రవితేజ చిత్రాలకు టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ ఆయన కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’కి ఆరంభ వసూళ్లు కూడా కరవయ్యాయి.

సినిమా వీకెండ్లో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాకైంది. భవిష్యత్తులో సినిమాల పరిస్థితి ఏమవుతుందో అని భయం పట్టుకుంది అందరికీ. కానీ వారం తిరిగేసరికి మొత్తం కథ మారిపోయింది. గత వారాంతంలో విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు బాక్సాఫీస్‌ను మళ్లీ కళకళలాడిస్తున్నాయి. ‘బింబిసార’ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతుంటే.. ‘సీతారామం’ తొలి రోజు సాయంత్రం నుంచి పుంజుకుని వీకెండ్లో అదరగొట్టింది.

ఈ రెండు చిత్రాలకూ మంచి టాక్ రావడం కలిసొచ్చిన మాట వాస్తవమే కానీ.. ఇవి విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. కచ్చితంగా ఈ చిత్రాలను థియేటర్లలోనే చూడాలి అనే భావన కలిగించాయి. ఈ రోజుల్లో ఇదే అత్యంత కీలకమైన విషయం. ‘బింబిసార’ విషయానికి వస్తే ఇది చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. కళ్యాణ్ రామ్ బింబిసార అనే చక్రవర్తి పాత్రలో నటించిన ఎపిసోడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ఇలాంటి ఎపిసోడ్లను బాగా తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు వాటిని పెద్ద తెర మీదే చూడాలనుకుంటారు. ‘బాహుబలి’ అంత భారీతనం లేకపోయినా.. పరిమిత బడ్జెట్లో ఈ ఎపిసోడ్‌ను గ్రాండియర్ చూపించగలిగింది చిత్ర బృందం. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఆసక్తికరంగా అనిపించడంతో ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగింది. ఇక ‘సీతారామం’ విషయానికి వస్తే.. అది అందమైన ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ప్రతి పాటా ముగ్ధ మనోహరంగా అనిపించింది.

లిరికల్ వీడియోలు చూసి పెద్ద తెరపై ఈ పాటలు చూడాలని.. దుల్కర్-మృణాల్ జంట మధ్య ప్రేమ సన్నివేశాలను ఆస్వాదించాలని ప్రేక్షకుల్లో కోరిక పుట్టింది. కథ పరంగా కూడా ఆసక్తికరంగా అనిపించడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ముందే సిద్ధమయ్యారు. ఇప్పుడు బింబిసార, సీతారామం రెండు చిత్రాలకూ పాజిటివ్ టాక్ రావడంతో జనం పెద్ద ఎత్తునే థియేటర్లకు వెళ్తున్నారు. దీన్ని బట్టి ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలి అనే భావన ప్రేక్షకుల్లో తీసుకురావడం అత్యంత కీలకమైన విషయం అన్నది స్పష్టం.