బింబిసార vs సీతారామం.. సీన్ రివ‌ర్స్

టాలీవుడ్లో రెండు నెలల కింద‌టి సీన్ పున‌రావృతం అవుతోంది. మేజ‌ర్, విక్ర‌మ్ చిత్రాల త‌ర్వాత ఒకే వారం రిలీజైన రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. వాటి వాటి స్థాయిలో మంచి వ‌సూళ్లే సాధిస్తున్నాయి. రెండూ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఐతే బింబిసార ఓ మోస్త‌రు టాక్ తెచ్చుకుని కూడా భారీ వ‌సూళ్లు సాధిస్తోంది.

సీతారామం చాలా మంచి టాక్ తెచ్చుకుని ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌తో సాగుతోంది. మాస్ సినిమా కావ‌డం బింబిసార‌కు ప్ల‌స్ అవుతుండ‌గా… మ‌రీ క్లాస్‌గా ఉండ‌డం సీతారామంకు స‌మ‌స్యగా మారుతున్న‌ట్లుంది. తొలి రోజు బింబిసార వ‌సూళ్ల‌లో స‌గం కూడా సీతారామం సాధించ‌క‌పోవ‌డం ఆ చిత్ర బృందాన్ని కొంత నిరాశ‌కు గురి చేసేదే. ఐతే తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఇలా ఉంటే.. యుఎస్‌లో ఈ రెండు చిత్రాల ప‌రిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది.

యుఎస్‌లో సీతారామం దూకుడు చూపిస్తుండ‌గా.. బింబిసార డ‌ల్‌గా న‌డుస్తోంది. ప్రిమియ‌ర్ల‌తో క‌లిసి శుక్ర‌వారం నాటికి సీతారామం యుఎస్‌లో 2 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డం, అక్క‌డి ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ సినిమా కావ‌డంతో శ‌నివారం భారీ వ‌సూళ్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. వీకెండ్ అయ్యేలోపు సీతారామం యుఎస్‌లో హాఫ్ మిలియ‌న్ మార్కును అందుకున్నా ఆశ్చ‌ర్యం లేదు.

ఫుల్ ర‌న్లో మిలియ‌న్ మార్కును కూడా టార్గెట్ చేయొచ్చు. ఐతే బింబిసారకు నామ‌మాత్రంగా ప్రిమియ‌ర్స్ వేశారు. సీతారామంతో పోలిస్తే స‌గం లొకేష‌న్లు, త‌క్కువ స్క్రీన్ల‌లో ప్రిమియ‌ర్స్ ప‌డ్డాయి. షోలు కూడా ఆల‌స్య‌మ‌య్యాయి. ప్రిమియ‌ర్స్‌తో క‌లిసి ఈ చిత్రం తొలి రోజు ల‌క్ష డాల‌ర్లు కూడా వ‌సూలు చేయ‌లేదు. ఇది మాస్ సినిమా కావ‌డంతో యుఎస్ హ‌క్కుల‌ను కూడా త‌క్కువ‌కే ఇచ్చిన‌ట్లున్నారు. రిలీజ్ ప్లానింగ్ కూడా స‌రిగా లేదు. అక్క‌డ ఈ సినిమా వ‌సూళ్లు నామ‌మాత్రం అనే చెప్పాలి.