బింబిసార‌కు ఇలా.. సీతారామంకు అలా

మొత్తానికి మ‌ళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సంద‌డి క‌నిపిస్తోంది. ఒక వారాంతంలో ఒక సినిమా బాగా ఆడినా మురిసిపోయే ప‌రిస్థితుల్లో ఈ వారం రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను క‌ళ‌క‌ళ‌లాడించే ప‌రిస్థితి కనిపిస్తోంది. జూన్ తొలి వారంలో మేజ‌ర్, విక్ర‌మ్ సినిమాలు సంద‌డి చేశాక గ‌త రెండు నెల‌ల్లో థియేట‌ర్లు ఎలా వెల‌వెల‌బోయాయో అంద‌రూ చూశారు.

రాను రాను ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారి.. వీకెండ్లో కూడా ఆక్యుపెన్సీ లేక థియేట‌ర్ల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇలాంటి ప‌రిస్థితిలో బింబిసార‌, సీతారామం సినిమాలు ఆశ‌లు రేకెత్తించాయి. అంచనాల‌ను పెంచాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే రెండు చిత్రాలూ పాజిటివ్ టాక్‌తో మొద‌లు కావడంతో ప‌రిశ్ర‌మ‌లో అంద‌రూ సంతోషంగా ఉన్నారు. అదే స‌మ‌యంలో ప్రేక్ష‌కులు కూడా చాన్నాళ్ల త‌ర్వాత మంచి సినిమాలు వ‌చ్చాయ‌ని, థియేట‌ర్ల‌కు వెళ్లి చూడాల‌ని కోరుకుంటున్నారు.

ఐతే రెండు సినిమాల్లో ఎక్కువ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది సీతారామం మూవీనే. దీన్ని మోడ‌ర్న్ క్లాసిక్‌గా అభివ‌ర్ణిస్తున్నారు చాలామంది. రివ్యూలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఆడియ‌న్స్ స్పంద‌న కూడా గొప్ప‌గా ఉంది. కాక‌పోతే ఇది క్లాస్ సినిమా కావ‌డంతో ఉద‌యం థియేట‌ర్ల ఆక్యుపెన్సీ త‌క్కువ‌గా క‌నిపించింది. మ‌ధ్యాహ్నానికి ప‌రిస్థితి మెరుగుప‌డింది. సాయంత్రం షోలకు ఇంకా సంద‌డి పెరిగింది. ముఖ్యంగా మ‌ల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి స్పంద‌న చాలా బాగుంది.

బింబిసార విష‌యానికి వ‌స్తే.. దీనికి సీతారామం స్థాయిలో అప్లాజ్ రాలేదు. రివ్యూ రేటింగ్స్ కొంచెం త‌గ్గాయి. కానీ డీసెంట్ మూవీ అనే టాక్ వ‌చ్చింది. ఇది మాస్ మూవీ కావ‌డం, ఫాంట‌సీ-హిస్టారిక‌ల్ ట‌చ్ ఉండ‌డం బాగా క‌లిసొస్తోంది. మాస్ ప్రేక్ష‌కులు దీనికే ప‌ట్టం క‌డుతున్నారు. ఉద‌యం హౌస్ ఫుల్స్‌తో మొద‌లైన సినిమా.. ఆ త‌ర్వాత ఇంకా పుంజుకుంది. వ‌సూళ్ల ప‌రంగా చూస్తే ఈ చిత్రానిదే పైచేయి. ఐతే సీతారామం రాను రాను ఇంకా పుంజుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. శ‌ని, ఆదివారాల్లో రెండు చిత్రాలూ బాక్సాఫీస్‌ను క‌ళ‌క‌ళ‌లాడించడం ఖాయమ‌నే చెప్పొచ్చు.