డిజాస్ట‌ర్ స్ట్రీక్ ఆగుతుందా?

రెండు నెల‌లు దాటింది. టాలీవుడ్లో ఒక సినిమా ఓ మోస్త‌రుగా ఆడి. జూన్ తొలి వారంలో విడుద‌లైన మేజ‌ర్, విక్ర‌మ్ చిత్రాలు బాక్సాఫీస్‌ను క‌ళ‌క‌ళ‌లాడించాక ఏ సినిమా కూడా సంద‌డి చేయ‌లేక‌పోయింది. వ‌రుస‌గా ఎనిమిది వారాలు టాలీవుడ్ బాక్సాఫీస్ చేదు అనుభ‌వాలు ఎదుర్కొంది. ప్ర‌తి వారం కొత్త సినిమా మీద ఆశ‌లు పెట్టుకోవ‌డం.. అది నిరాశ‌కు గురి చేయ‌డం మామూలైపోయింది.

అంత‌కంత‌కూ వ‌సూళ్లు ప‌డిపోతూ.. ఇండ‌స్ట్రీని ఆందోళ‌న‌కు నెట్టేలా సాగింది డిజాస్ట‌ర్ స్ట్రీక్. గ‌త వారం విడుద‌లైన మాస్ రాజా ర‌వితేజ సినిమా రామారావు ఆన్ డ్యూటీ సైతం దారుణ‌మైన ఫ‌లితాన్నందుకుంది. ఇలాంటి టైంలో ఈ శుక్ర‌వారం విడుద‌ల‌కు సిద్ధ‌మైన బింబిసార‌, సీతారామం చిత్రాల మీద టాలీవుడ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఈ రెండు చిత్రాలూ ఆస‌క్తిక‌ర ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాయి. ఇవి రెండూ స్యూర్ షాట్ హిట్ అయ్యేలా క‌నిపించి.. మేజ‌ర్, విక్ర‌మ్ త‌ర‌హా డ‌బుల్ ధ‌మాకా వినోదాన్ని అందిస్తాయ‌న్న భ‌రోసాను క‌లిగించాయి.

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సొంత బేన‌ర్లో కొత్త ద‌ర్శ‌కుల‌ను న‌మ్మి సాహ‌సోపేత చిత్రాలు చేసే క‌ళ్యాణ్ రామ్.. వ‌శిష్ఠ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ని న‌మ్మి బింబిసార‌తో అలాంటి సాహ‌స‌మే చేశాడు. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో ఫాంట‌సీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకునే వ‌ర‌కు జ‌నాల దృష్టిలోనే ప‌డ‌లేదు. కానీ కేవ‌లం రెండు ట్రైల‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ పెంచి సినిమా కోసం అంద‌రూ ఎదురు చూసేలా చేయగ‌లిగింది చిత్ర బృందం. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జ‌రిగాయి.

ఇక ఈ సినిమాకు కావాల్సింద‌ల్లా పాజిటివ్ టాకే. అది వ‌స్తే మాస్ ఈ సినిమాను బాగా ఆద‌రించేలా క‌నిపిస్తున్నారు. ఇక క్లాస్ ల‌వ్ స్టోరీల‌కు పేరుప‌డ్డ హ‌ను రాఘ‌వ‌పూడి.. పడి ప‌డి లేచె మ‌న‌సు ప‌రాభ‌వం త‌ర్వాత ఎంతో క‌స‌ర‌త్తు చేసి దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కించిన సీతారామం అంద‌మైన ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. క్లాస్ ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. ఈ చిత్రానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓకే అనిపించాయి. దీనికి కూడా టాక్ కీల‌కం. మ‌రి ఈ చిత్రం కూడా పాజిటివ్ నోట్‌తో మొద‌లై మ‌ళ్లీ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతుందేమో చూడాలి.