మొదటి ప్రీమియర్ తెలంగాణలోనే

రేపు విడుదల కాబోతున్న బింబిసార మీద కళ్యాణ్ రామ్ ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నాడో అంతకు రెట్టింపు ఉత్సాహంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాగా గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కావడంతో ప్రమోషన్ల విషయంలో టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు, ప్రోగ్రాంలు చేస్తూనే వచ్చింది.

అత్తయ్య హఠాన్మరణంతో ఒక రోజు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చినా కళ్యాణ్ రామ్ తిరిగి పబ్లిసిటీ పనుల్లో బిజీ అయ్యాడు. డిఫరెంట్ జానర్ తో వస్తున్న సీతారామం అండర్ కరెంట్ గా గట్టి పోటీనే ఇస్తోంది. సాధారణంగా మనకంటే చాలా ముందుగా యుఎస్ ప్రీమియర్లు పడటం సహజంగా జరిగేదే. కానీ బింబిసార విషయంలో మాత్రం స్ట్రాటజీ మార్చేశారు. భారతీయ కాలమాన ప్రకారం ఉదయం 7 గంటలకు అమెరికాలో మొదటి షో పడనుంది.

అయితే దానికన్నా అరగంట ముందే ఇండియాలో స్టార్ట్ కానుంది. అదే అసలు ట్విస్ట్. హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్ లో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఫ్యాన్స్ షో వేస్తున్నారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఆన్ లైన్ లో పెట్టిన నిమిషాల్లోనే వేగంగా సోల్డ్ అవుట్ అయిపోయింది.

మాములుగా ఓవర్సీస్ నుంచి లైవ్ అప్ డేట్స్ వచ్చే ట్రెండ్ కి భిన్నంగా ఈసారి అరగంట ముందే ఫ్యాన్స్ నుంచి సినిమా ఎలా ఉందని తెలిసిపోతుందన్న మాట. ఇలా చేయడం వెనుక కారణం ఏమిటో తెలియదు కానీ టీమ్ మాత్రం యునానిమస్ గా ఒకే టాక్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. దీని వల్ల రెవిన్యూ పరంగా కొంత తగ్గినప్పటికీ సోషల్ మీడియా ప్రభావం దృష్ట్యా ఇలా చేయడం మంచి పనే. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ ఫాంటసి డ్రామా ఇప్పుడున్న పరిస్థితుల్లో హిట్ కావడం బాక్సాఫీస్ కు చాలా అవసరం.