చాలా రోజుల తర్వాత ప్రభాస్ పబ్లిక్ స్టేజి మీద కనపడ్డాడు. సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా వచ్చి అలరించాడు. ఫ్యాన్స్ ని అనుమతించకపోవడం సందడి లేకుండా చేసినప్పటికీ ఇటీవలే ఇతర వేడుకల్లో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా కేవలం మీడియాకు మాత్రమే పరిమితం చేశారు. ఒకవేళ అభిమానులను కూడా ప్లాన్ చేసి ఉంటే విపరీతమైన రద్దీని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడాల్సి వచ్చేది.
రాధే శ్యామ్ తర్వాత తమ హీరో దర్శనమిచ్చే ఛాన్స్ ని ఎవరు మాత్రం వదులుకుంటారు. అందుకే ఇది తెలివైన నిర్ణయమే. ఇక ప్రభాస్ అల్ట్రా కూల్ లుక్ తో అదరగొట్టేశాడు. ఆ మధ్య ముంబైలో ఆది పురుష్ దర్శకుడు ఓం రౌత్ ఇంటికి వెళ్ళినప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన డార్లింగ్ ఇప్పుడు మాత్రం పక్కాగా మునుపటి బాడీ లాంగ్వేజ్ తో వచ్చాడు. అంతేకాదు చలాకి మాటలతో ఆకట్టుకున్నాడు.
ముఖ్యంగా నిర్మాతల్లో ఒకరైన స్వప్నా దత్ ని ఉద్దేశిస్తూ ఆవిడ రాకపోతే నేను స్పీచ్ ఇవ్వనని మొండికేసి, ట్రైలర్ లో హీరోయిన్ కన్నా ఎక్కువ తనకే బెస్ట్ షాట్ కట్ చేశారని ఇచ్చిన కౌంటర్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఇలాంటి టైమింగ్ తన నోటి వచ్చి ఎన్ని రోజులయ్యిందో..
మొత్తానికి సీతారామంకు ప్రభాస్ రాక కొత్త జోష్ ని తీసుకొచ్చింది. యుద్ధం నేపథ్యంలో రూపొందిన గ్రాండియర్ లవ్ స్టోరీగా ప్రమోషన్లో మంచి హైప్ వచ్చినప్పటికీ జనం థియేటర్లకు రప్పించడంలో ఈ కంటెంట్ బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దుల్కర్ సల్మాన్ ని కేరళ కంటే ఎక్కువగా ఇక్కడే ఇంటర్వ్యూలు వగైరా చేయించారు. బింబిసార పోటీని తట్టుకుని నిలవాలంటే ఈ మాత్రం చేయక తప్పదు. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ని తెస్తే వీళ్ళు ప్రభాస్ ని తీసుకొచ్చారు. మొత్తానికి ఎవరికెవరు తీసిపోరనే రేంజ్ లో హంగామా చేస్తున్నారు.