చరణ్ ఇలా మారిపోయాడేంటి?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు ఏడాదిన్నరగా ఒకే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం అతను లుక్‌ను మార్చుకున్నాడు. గడ్డం తీసేసి.. కోర మీసం పెంచి కొత్తగా తయారయ్యాడు. చరణ్ కెరీర్లోనే ఇది బెస్ట్ లుక్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ మొదలయ్యాక ఎప్పుడూ అతను లుక్ మార్చింది లేదు. బహుశా సినిమాలో పూర్తిగా ఒకే లుక్‌ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. లాక్ డౌన్ మొదలయ్యాక కూడా కొత్తలో చరణ్ ఇదే లుక్ మెయింటైన్ చేశాడు. ఐతే కొన్ని రోజులుగా చరణ్ ఎక్కడా బయట కనిపించలేదు. అతడి లుక్ ఎలా ఉందో తెలియలేదు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఎప్పుడైనా పున:ప్రారంభం అయ్యే అవకాశముండటంతో అతను ఆ లుక్‌నే మెయింటైన్ చేస్తుండొచ్చని అంతా అనుకున్నారు.

కానీ ఉన్నట్లుండి చరణ్ పెద్ద షాకిచ్చాడు. జుట్టు, గడ్డం బాగా పెంచి ‘రంగస్థలం’ నాటి రోజులను గుర్తుకు తెచ్చాడు. గురువారం చరణ్‌కు సన్నిహితుడైన డ్యాన్స్ మాస్టర్ జానీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు చరణ్. అందులో చరణ్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఏడాదిగా ఉన్న లుక్‌కు పోలికే లేదు. లాక్ డౌన్‌లో లుక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చరణ్ ఇలా గడ్డం, జుట్టు అలా పెంచి వదిలేశాడా.. లేక ‘ఆచార్య’లో అతిథి పాత్ర కోసం ఏమైనా లుక్ మార్చాడా.. లేక ‘ఆర్ఆర్ఆర్’లోనే లుక్ మార్చి వేరే సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం ఏమైనా ఉందా.. అన్నది అర్థం కావడం లేదు. మరి మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయ్యే నాటికి చరణ్ ఏ లుక్‌లోకి మారతాడో చూడాలి.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content