ప్రేక్షకులు క్లారిటీగా చెప్పేశారు

కొవిడ్ తర్వాత థియేటర్ల పరిస్థితి రోజు రోజుకూ అగమ్య గోచరంగా తయారవుతోంది. ఎన్నడూ లేని స్థాయిలో థియేటర్లలో ఆక్యుపెన్సీ పడిపోతోంది. సినిమాల సక్సెస్ రేట్ మామూలుగానే తక్కువ కాగా.. ఇప్పుడు అది మరీ దారుణంగా పడిపోతోంది. స్టార్ కాస్ట్ ఉన్నా, పెద్ద రేంజ్ సినిమాలైనా సరే.. టాక్ కొంచెం అటు ఇటుగా ఉంటే బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టేస్తున్నాయి. 

వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నపుడు ప్రేక్షకులు థియేటర్లకు దూరమై ఓటీటీలకు అలవాటు పడడం, థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక టికెట్ల ధరలు అసాధారణంగా పెరిగిపోవడం.. క్రమంగా ప్రేక్షకులను వెండితెరలకు దూరం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అలా అని ప్రేక్షకులు అసలు థియేటర్లకే రారా, ఏ సినిమా చూడరా అంటే అదీ లేదు. వాళ్లు మామూలు సినిమాలకైతే థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఏదో ఒక క్రేజీ అంశం ఆకర్షించాలి. ముఖ్యంగా ‘విజువల్ ఎక్స్‌పీరియన్స్’ కోసం ప్రేక్షకులు ప్రధానంగా థియేటర్లకు వస్తారన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. థియేటర్లలో మాత్రమే చూడాలి అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించడం ఒక సినిమాకు సంబంధించి ఇప్పుడు అతి ముఖ్యమైన అంశంగా మారుతోంది. వేసవిలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 చిత్రాలను అలా ఎగబడి చూశారంటే విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే.

ఆ చిత్రాల్లోని ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలు వెండితెరలపై చూస్తే కలిగే అనుభూతి వేరు. టీవీల్లో, మొబైళ్లలో చూస్తే ఆ అనుభూతి కలగదు. మేజర్, విక్రమ్ సినిమాల్లో కూడా అలా బిగ్ స్క్రీన్ల మీద ఎంజాయ్ చేసే అంశాలు ఉన్నాయి. వీటి తర్వాత సినిమాలు ఏవీ కూడా ప్రత్యేకమైన అనుభూతిని పంచలేదు. ఇప్పుడు వివిధ భాషల్లో విజయవంతంగా ఆడుతున్న ‘విక్రాంత్ రోణ’ కూడా భిన్నమైన విజువల్‌ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేదే. ఇది అంత గొప్ప టాక్ ఏమీ తెచ్చుకోలేదు.

కానీ సినిమాలో భారీతనం ఉంది. విజువల్‌గా గొప్పగా అనిపించే సినిమా ఇది. త్రీడీలో ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఇలా ఒక సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలి అనిపించడం కీలకమైన విషయం. వచ్చే వారం రాబోతున్న బింబిసార, సీతారామం కూడా అలాంటి అనుభూతిని ప్రామిస్ చేస్తున్నవే. ‘బింబిసార’కు చారిత్రక నేపథ్యం ప్లస్ అవుతుండగా.. ‘సీతారామం’లో ఒక ఎమోషన్, భావుకత కనిపిస్తున్నాయి. కాబట్టి విజువల్‌గా ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప థియేటర్లకు ప్రేక్షకులు కదలరన్నది స్పష్టం.