ఎన్టీఆర్ చిన్న కూతురు.. గొప్ప మనసు

సీనియర్ ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి మరణ వార్త తెలిసి నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్య సమస్యల వల్లే ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కూతురు దీక్షిత వెల్లడించారు. అనారోగ్య సమస్యల వల్ల ఉమా మహేశ్వరి మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలుస్తోంది. ఉమా మహేశ్వరి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
ఎన్టీఆర్ నాలుగో కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య ఘటన నందమూరి అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కొన్ని నెలల క్రితం ఉమా మహేశ్వరి చిన్న కూతురి వివాహం ఘనంగా జరిగింది. నిన్న ఉదయం 10 గంటల సమయంలో గదిలోకి వెళ్లి ఉమా మహేశ్వరి తలుపులు వేసుకున్నారని ఆ తర్వాత ఎంతకీ తలుపులు తీయకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు కూతురు అల్లుడు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారని సమాచారం.
 
కూతురు అల్లుడు లోపలికి వెళ్లేసరికి ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఉమా మహేశ్వరి చివరి కోరిక మేరకు ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. అవయవ దానం చేయడం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు పంచాలన్న ఉమా మహేశ్వరి మనస్సు గొప్ప మనస్సు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఉమా మహేశ్వరి పోస్టుమార్టం నివేదిక రెండు రోజుల్లో రానుందని వైద్యులు చెబుతున్నారు.
 
సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం నందమూరి అభిమానులను బాధిస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ చిన్న వయస్సులోనే మృతి చెందారు. సీనియర్ ఎన్టీఆర్  ఐదో కుమారుడు సాయికృష్ణ కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ 2018 సంవత్సరం ఆగష్టు నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం అభిమానుల్లో విషాదాన్ని నింపింది.