నిన్న విడుదలైన రామారావు ఆన్ డ్యూటీకి వస్తున్న స్పందన తెలిసిందే. రవితేజ ఎంత నమ్మకం పెట్టుకున్నప్పటికీ కనీసం అభిమానులనైనా సంతృప్తి పరిచేలా సినిమా లేకపోవడంతో మాస్ మహారాజాకు మరో చేదు ఫలితం తప్పలేదు వీకెండ్ రెండు రోజులు ఎంత వస్తే దాని మీదే మాగ్జిమమ్ ఆధారపడే పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ టాక్ కి వచ్చే వారం రాబోతున్న బింబిసార- సీతారామంల పోటీని తట్టుకుని నిలవడం కష్టంగానే కనిపిస్తోంది. థాంక్ యు చేదు జ్ఞాపకాలు మరిచిపోకముందే ట్రేడ్ కి మరో షాక్ తగిలింది.
ఇదిలా ఉండగా రిలీజ్ రోజు ప్రసాద్ ఐమ్యాక్స్ బయట తమ హీరోల సినిమాలు ఎలా ఉన్నా ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకోవడం మాములే. యూట్యూబ్ ఛానెల్స్ ఈ వీడియోలనే వ్యూస్ కోసం ఆదాయ మార్గాలుగా మార్చుకున్నాయి. అయితే రామారావు ఆన్ డ్యూటీ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. దర్శకుడు శరత్ మండవని ఉద్దేశించి కొందరు ఫ్యాన్స్ నేనింతేలో సాయిరామ్ శంకర్ స్టయిల్ లో థియేటర్ వైపు రాకండని, వస్తే మూకుమ్మడిగా నిలదీస్తామని బాధ కోపం రెండూ కలగలిసిన ఫీలింగ్స్ ని బయటపెట్టేశారు.
నేనింతే రిలీజ్ టైంలోనే కాదు ఇప్పటికీ అది ఐకానిక్ సీన్ నిలిచిపోయింది., వాస్తవ పరిస్థితులను అద్దం పట్టే విధంగా పూరి జగన్నాధ్ దర్శకుడు పాత్రలో బ్రహ్మానందంతో చేయించిన కామెడీ ఓ రేంజ్ లో పేలింది. ఇప్పుడా సంఘటనే ఇన్నేళ్ల తర్వాత నిజంగానే రిపీట్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రవితేజకు ఫ్లాప్ చూడటం కొత్తేమి కాదు కానీ క్రాక్ తో కంబ్యాక్ అయ్యాక ఖిలాడీ దెబ్బ కొట్టాక రామారావు ఆన్ డ్యూటీ మళ్ళీ బ్రేక్ ఇస్తుందేమోనని ఆశిస్తే ఇలా జరిగిపోయింది. ఇకపై మాస్ మహారాజా స్పీడ్ కన్నా ముఖ్యంగా కంటెంట్ మీద దృష్టి పెట్టాల్సిన టైం వచ్చేసింది.