భయపడినంతా జరుగుతోంది. టికెట్ రేట్లు సామాన్యులను థియేటర్లకు ఎలా దూరం చేస్తున్నాయో ప్రత్యక్షంగా అర్థమవుతోంది. బాలేదనే టాక్ వస్తే చాలు మొదటి రోజు మధ్యాహ్నం ఆటకే ఖాళీ సీట్లు వెక్కిరిస్తున్నాయి. దానికి స్టార్ డంతో సంబంధం లేకుండా పోతోంది. లక్షలు కోట్లు పోసి కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కొన్ని సినిమాలు దారుణమైన పీడకలలుగా మారుతున్నాయి. ముఖ్యంగా బిసి సెంటర్లలో పరిస్థితి రానురాను మరీ దారుణంగా దిగజారిపోతోంది. ఎంతగా అంటే సూపర్ మార్కెట్లో ఆఫర్ ఇచ్చినట్టుగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా వెలుగోడులో రంగా థియేటర్ ఉంది. గత వారం విడుదలైన థాంక్ యుకి నెగటివ్ టాక్ రావడంతో సి కేంద్రమైన దానికి పబ్లిక్ రెస్పాన్స్ బాలేదు. వారం గడవకుండానే ఈ పరిస్థితి తలెత్తడంతో యాజమాన్యం ఆఫర్లు ప్రకటించింది. టికెట్ రేట్ ని 70 రూపాయలకి ఫిక్స్ చేయడంతో పాటు ఏకంగా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చేశారు. అంటే ఇద్దరు వస్తే చెరో 35 రూపాయల ఖర్చుతో నాగ చైతన్య కొత్త సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయొచ్చన్న మాట. ఇది మూడు రోజులకే పరిమితం చేశారు లెండి.
ఇది పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో తేటతెల్లం చేస్తోంది. సినిమాబాగుందా బాలేదా అనేది పక్కనపెడితే మహేష్ బాబు, చిరంజీవి లాంటి స్టార్లకు సైతం కనీసం ఓపెనింగ్స్ రోజే హౌస్ ఫుల్ చేయలేని దైన్యం నెలకొంటోంది. సరే వాళ్ళు సీనియర్లు అనుకుంటే అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన యూత్ హీరో సైతం అదే ఫేజ్ ని ఎదురుకోవడం విషాదం. ఇలాంటి పరిణామాలను ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఎలాంటి నిర్ణయాలు వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుందో అర్జెంట్ గా గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి .