కమల్ ఆశలు వదులుకున్నట్లేనా?

జయలలిత, కరుణానిధిల మరణంతో తమిళనాట నెలకొన్న రాజకీయ శూన్యతను ఉపయోగించుకుని, చక్రం తిప్పుదామని.. రాష్ట్రాన్ని ఏలేద్దామని ఎన్నో ఆశలతో రాజకీయ పార్టీని ఆరంభించాడు కమల్ హాసన్. ఆయన సమకాలీనుడు రజినీకాంత్ ఇలాంటి ప్రయత్నమే చేసినా.. ఆయన పార్టీ మొదలు కాకముందే ఆగిపోయింది. కమల్ మాత్రం పార్టీ పెట్టాడు. జనాల్లో తిరిగాడు. కొత్త తరహా రాజకీయం చేస్తానని.. మార్పు తెస్తానని ఘనంగా ప్రకటనలు చేశాడు. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ కమల్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశాక ఆ పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

ఐతే రాజకీయాలకు దూరమవుతున్నట్లు కానీ, పార్టీని మూసి వేస్తున్నట్లు కానీ కమల్ ఆ టైంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు. కొంత విరామం ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.

పార్టీ నడపాలి అంటే ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ప్రత్యామ్నాయ శక్తిలా కనిపించాలి. అన్నాడీఎంకే అంతకంతకూ బలహీన పడుతున్న నేపథ్యంలో కమల్ సిన్సియర్‌గా పోరాటం చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉండొచ్చు. కానీ కమల్‌కు ఆ ఓపిక లేనట్లే ఉంది. అందుకే రాజకీయ కార్యకలాపాలన్నీ ఆపేసి సినిమాల మీద దృష్టిపెట్టాడు. సీఎం పదవి చేపట్టిన స్టాలిన్‌ను వెళ్లి కలిసి అభినందించడం, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌తో చాలా సన్నిహితంగా మెలగడం, తనతో కలిసి ‘విక్రమ్’ సినిమాను నిర్మించడాన్ని బట్టి కమల్ ఆలోచన అర్థమైపోతోంది.
తాజాగా ఆయన ఉదయనిధిని హీరోగా పెట్టి తనే సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు. ఉదయనిధికి నటుడిగా ఎప్పుడూ అంత మంచి పేరు లేదు. తన పలుకుబడితోనే అవకాశాలు అందుకున్నాడు. ఇప్పుడు సీఎం కొడుకు కావడంతో అతడికి డిమాండ్ ఇంకా పెరిగింది. తనతో సినిమాలు చేయడానికి పేరున్న దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు. అందులో కమల్ కూడా ఒకడయ్యాడు. ఈ సినిమా ప్రకటన చూశాక కమల్ పూర్తిగా రాజకీయాల మీద ఆశలు వదులుకున్నట్లే అని, ఆయనకు అధికారంలో ఉన్న వారి మీద పోరాడే ఓపిక ఏమాత్రం లేదని జనం కూడా ఓ నిర్ణయానికి వచ్చేసినట్లే.