ఆ నిర్మాతకు మంచి రోజులొస్తాయా?

సుధాకర్ చెరుకూరి.. ఈ పేరు ఇండస్ట్రీ జనాలకే కాదు, సామాన్య ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. మంచి మంచి కాంబినేషన్లలో చక్కటి అభిరుచితో ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్’ బేనర్ మీద సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ ఇతను. పూర్తి స్థాయి నిర్మాతగా మారి అతను ప్రొడ్యూస్ చేసిన తొలి చిత్రం ‘పడి పడి లేచె మనసు’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు రేకెత్తించింది. కానీ ద్వితీయార్ధంలో సినిమా గాడి తప్పడంతో బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం ఎదురైంది. ఆ తర్వాత ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను నిర్మించాడు సుధాకర్. అది కూడా కొంచెం విషయం ఉన్న సినిమానే కానీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకూల ఫలితం రాలేదు.

ఇక సాహసోపేత కథతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసిన ‘విరాటపర్వం’ సంగతి తెలిసిందే. రొటీన్ మాస్ మసాలా సినిమాల కోసం వెంపర్లాడకుండా కథల ఎంపికలో, కాంబినేషన్ల విషయంలో అభిరుచి చూపించినా.. సుధాకర్‌కు సరైన ఫలితం దక్కలేదు. ఒక నిర్మాత వరుసగా మూడు ఎదురు దెబ్బలు తగిలితే తట్టుకుని నిలబడడం కష్టమే.

కానీ సుధాకర్ వెనుకంజ వేయలేదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘దసరా’ లాంటి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఇందులో తొలి చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మామూలుగా రవితేజతో అంటే అందరూ కమర్షియల్ లెక్కలేసుకుని రొటీన్ మాస్ మసాలా సినిమా తీయడానికే ప్రయత్నిస్తారు. కానీ తన మిత్రుడైన శరత్ మండవకు దర్శకుడిగా అవకాశమిస్తూ.. కంటెంట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ తీశాడు సుధాకర్. దీని ప్రోమోలు చూస్తే.. కథ ప్రధానంగా సాగే సినిమాలా కనిపిస్తోంది. అందుకేనేమో సినిమాకు ఎక్కువ బజ్ కూడా లేదు.

రవితేజ మార్కు మాస్ సినిమా చేస్తే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ దర్శక నిర్మాతలు కంటెంట్‌ను నమ్మి సినిమా‌కు మంచి టాక్ వస్తుందని, వీకెండ్లో దమ్ము చూపిస్తుందని భరోసాతో ఉన్నారు. ఇలా కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేసే నిర్మాతలు తక్కువ. అలాంటి నిర్మాతలుంటేనే మంచి సినిమాలు వస్తాయి. మరి అభిరుచి ఉన్న ఈ నిర్మాతకు ఇప్పుడైనా మంచి రోజులు వస్తాయేమో.. ‘రామారావు’ ఆయనకు తొలి కమర్షియల్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.