మాచర్ల దర్శకుడికి ట్వీట్ల తలపోటు

ఇప్పుడొస్తున్న సినిమాలకు ఏదైనా కాంట్రావర్సీ దొరికితే చాలు అదెంత ఫ్రీ పబ్లిసిటీకి ఉపయోగడపడుతుందో చూస్తున్నాం. లైగర్ కు కేవలం పోస్టర్లే సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ చేసి పెట్టాయి. కోట్ల రూపాయలు వెచ్చించినా కొనలేని ప్రచారం విజయ్ దేవరకొండ పూలగుత్తి లుక్కు తెచ్చి పెట్టింది. కానీ ప్రతిసారి ఇలా జరగదు. కొన్ని వివాదాలు నెగటివ్ ట్రెండ్ కి దారి తీస్తాయి. నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం రూపొందించిన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు అలాంటి చిక్కులో పడటం హాట్ టాపిక్ గా మారింది.

2019 ఎన్నికల టైంలో చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా జగన్ కి మద్దతుగా పెట్టిన కొన్ని ట్వీట్ల తాలూకు స్క్రీన్ షాట్లు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. తాను మద్దతు ఇచ్చిన పార్టీ తనది ఒకే సామజిక వర్గం కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఎంఎస్ఆర్ అలాంటి ట్వీట్లు పెట్టారని ఇప్పుడు దాని మీదే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే రాజశేఖర్ రెడ్డి మాత్రం వీటిని ఖండిస్తున్నారు. తన ప్రమేయం లేకుండా ఇవి చేశారని, ఫోటో షాప్ లో ఫేక్ ఎడిట్లతో తనను టార్గెట్ చేశారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

అయితే ఆ ట్వీట్లలో కొన్ని నిజమే అయినప్పటికీ భవిష్యత్తులో ఇవే తనకు ఇబ్బంది అవుతాయని బహుశా మాచర్ల దర్శకుడు ఊహించి ఉండడు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ట్వీట్ ని తాను డిలీట్ చేయనని చెబుతున్నప్పటికీ ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ వ్యవహారం మాచర్ల నియోజకవరానికి తెచ్చే మేలేమీ లేదు. ఎప్పుడైతే కుల సమీకరణాలు ఇలాంటి గొడవల్లో ఎంట్రీ ఇస్తాయో అవి పాజిటివ్ గా మారే అవకాశాలు తక్కువ. మరి రిలీజ్ కు మూడు వారాలే టైం ఉన్న నేపథ్యంలో ఇదింకెలాంటి మలుపు తీసుకుంటుందో.