అంతు చిక్కని కారణాలతో కొత్త సినిమాల థియేట్రికల్ రన్ దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో నిర్మాతలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆసక్తి గొలుపుతున్నాయి. ఆచార్య, థాంక్ యు లాంటి చిత్రాల్లో కంటెంట్ ఎలా ఉందనేది పక్కనపెడితే మొదటి రోజు మార్నింగ్ షోకు రావాల్సిన కనీస ఆక్యుపెన్సీ కూడా విపరీతంగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. గతంలో అజ్ఞాతవాసి, వినయ విధేయ రామలకు కూడా ఇదే టాక్ వచ్చినా వాటి వసూళ్లు యాభై కోట్ల పైమాటే వచ్చాయి. కానీ ఇప్పుడంతా రివర్స్ అవుతోంది.
ఏం పెద్దగా లేదనే టాక్ వచ్చినా రిలీజ్ కు ముందు బజ్ లేకపోయినా పబ్లిక్ థియేటర్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీన్ని సరిదిద్దే ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అమలు చేయబోతున్న చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయోననే ఉత్సుకత మొదలయ్యింది. అందులో ప్రధానంగా టికెట్ రేట్ల ఇష్యూ ఉంది. మీడియం బడ్జెట్ సినిమాలకు మల్టీ ప్లెక్సుల్లో 177 రూపాయల గరిష్ఠ ధర పెట్టేసి చిన్నవాటికి మాత్రం 125కి పరిమితం చేయాలనే ప్రతిపాదన చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోల భారీ సినిమాలకు మాత్రం 295 ని ఫిక్స్ చేయబోతున్నారు. ఇంకా తగ్గిస్తే బాగుంటుందన్న అభిప్రాయం నెలకొంది కానీ ఛాంబర్ దానికి సుముఖంగా లేదు.
ఆరు కోట్ల లోపు బడ్జెట్ తో తీసే సినిమాలకు నాలుగు వారాల గ్యాప్. అంతకు మించి అయ్యేవాటికి 10 వారాల గ్యాప్ తో ఓటిటి స్ట్రీమింగ్ చేసుకోవచ్చనే కండీషన్ పెట్టబోతున్నారు. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి కానీ అమలులో ఫలితాలు అనుకున్నంత వేగంగా వస్తాయో లేదో చూడాలి. ముఖ్యంగా ఫ్లాప్ టాక్ వచ్చినవి చిన్నవైనా పెద్దవైనా పది వారాల నిడివి అనేది చాలా ఎక్కువ. అప్పటిదాకా ప్రేక్షకులు ఎదురు చూస్తారన్న గ్యారెంటీ లేదు, అంత గ్యాప్ ఉంది కాబట్టి ఇవ్వాల్సిన సొమ్ములో ఓటిటిలు తగ్గించే అవకాశమూ లేకపోలేదు. మొత్తానికి ఆగస్ట్ 1 తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.