కరోనా వైరస్‌పో పోరాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కలిపి కోటి.. కేంద్ర ప్రభుత్వానికి మరో కోటి విరాళంగా అందజేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరూ లక్షల్లో విరాళాలు ఇస్తున్న సమయంలో పవన్ ముందుకొచ్చి రెండు కోట్ల రూపాయల విరాళం ఇవ్వడంతో మిగతా స్టార్లందరిలోనూ కదలిక వచ్చింది. పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. దేశం మొత్తంలో తెలుగు సినీ పరిశ్రమ స్పందించిన స్థాయిలో మరే ఫిలిం ఇండస్ట్రీ స్పందించకపోవడం విశేషం. ఇలాంటి సంక్షోభ సమమయంలో తమ దాతృత్వాన్ని చాటుకున్న సినీ పరిశ్రమ వ్యక్తులందరికీ పవన్ ట్విట్టర్ ద్వారా పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతూ ట్విట్టర్లో పెద్ద పెద్ద ట్వీట్లు వేయడం విశేషం. ఇందులో ఒక్కొక్కరి గురించి పవన్ ఆసక్తికర రీతిలో స్పందించాడు.
సినీ పరిశ్రమకు ఎలాంటి కష్టం వచ్చినా తక్షణం స్పందించే వ్యక్తి తన పెద్ద అన్నయ్య చిరంజీవి అని.. ఆయన సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించడంపై తమ్ముడిగా గర్విస్తున్నానని పవన్ అన్నాడు. నాలుగు కోట్ల భూరి విరాళం ప్రకటించిన ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నాడన్న పవన్.. సమాజ క్షేమం గురించి ఆలోచించే మహేష్ బాబు కోటి రూపాయల విరాళంతో సమాజం పట్ల తనకున్న ఆపేక్షను వ్యక్తం చేశాడన్నాడు. తన అన్న బిడ్డ రామ్ చరణ్ తండ్రి అడుగు జాడల్లో పయనిస్తూ 75 లక్షల విరాళం అందించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడాడు.
ఇక తారక్ ప్రకటించిన రూ.75 లక్షల విరాళం గురించి స్పందిస్తూ అతణ్ని యువ శక్తి అని సంబోధించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి విపత్తు వచ్చినా స్పందించే అల్లు అర్జున్ అంటూ అతడి 1.25 కోట్ల విరాళం గురించి ప్రస్తావించాడు. సినీ కుటుంబం నుంచి తొలి విరాళంగా రూ.20 లక్షలు అందించిన నితిన్‌ను మెచ్చుకుని తీరవలసిందే అని చెప్పాడు. సినిమా హీరోగా నిలదొక్కుకుంటున్న అంటూ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు ఇంట్రో ఇచ్చాడు పవన్. రూ.20 లక్షల విరాళం అందించిన తన మిత్రుడు త్రివిక్రమ్ గురించి స్పందిస్తూ మృదు స్వభావి, సృజనాత్మక దర్శకుడు అంటూ కొనియాడాడు. కరోనా కోసం విరాళాలు ఇచ్చిన మిగతా సినీ ప్రముఖులకు కూడా పవన్ అభినందనలు తెలిపాడు.