చిరు పంచ్ ‘ఆచార్య’ గురించా?

‘ఆచార్య’ సినిమా గురించి ప్రి రిలీజ్ ఈవెంట్లో, ప్రమోషన్లలో చాలా గొప్పగా చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ తీరా చూస్తే ఆ సినిమా ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా విడుదల తర్వాత కొన్నాళ్లు చిరు మీడియాలో కనిపించలేదు.

తర్వాత తరచుగా సినిమా ఈవెంట్లలో కనిపిస్తున్నారు. అయినా ఎక్కడా ‘ఆచార్య’ ప్రస్తావన తేవట్లేదు. ఐతే తాజాగా తాను సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఆమిర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ తెలుగు ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. పరోక్షంగా ‘ఆచార్య’ సినిమా గురించి పంచ్ వేసినట్లుగా జనాలకు సందేహాలు కలుగుతున్నాయి.

ఆమిర్ ఖాన్ సినిమాల కోసం చాలా కష్టపడతాడని.. ప్రయోగాలు చేస్తాడని చెబుతూ.. తాను దానికి భిన్నమని చిరు వ్యాఖ్యానించాడు. తాను ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో తెలుసుకుని, వారి అభిరుచికి తగిన సినిమాలే చేసి మెప్పిస్తుంటానని చిరు వ్యాఖ్యానించాడు. ఐతే ఈ కామెంట్‌కు రైడర్ అన్నట్లుగా.. కొన్ని సినిమాల విషయంలో మాత్రం తన ప్రమేయం లేకుండా తప్పులు జరిగిపోతుంటాయని.. ఆ విషయంలో తానేమీ చేయలేనని చిరు పేర్కొన్నాడు. ఈ కామెంట్ ‘ఆచార్య’ విషయంలోనే అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

‘ఆచార్య’ డిజాస్టర్ కావడంలో తన తప్పేమీ లేదని.. అందులో తన ప్రమేయం లేదని చిరు చెప్పదలుచుకున్నాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ నుంచి ఇలాంటి డిజాస్టర్ రావడం పట్ల ఆశ్చర్యపోతున్న కొందరు జనాలు.. చిరంజీవి జోక్యం వల్లే ఆ సినిమా అలా తయారైందని, కొడుకు చరణ్ కోసం సిద్ధ పాత్రను పెంచి దానికి ప్రాధాన్యం ఎక్కువ దక్కేలా చేసి సినిమాను దెబ్బ తీశారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తన సినిమాల కథల ఎంపిక, స్క్రిప్టు, ఎడిటింగ్‌లో తన జోక్యం గురించి చిరు ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు కాబట్టి ‘ఆచార్య’ ఆయన జోక్యం వల్లే దెబ్బ తిందని కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా.. ఈ ప్రచారాన్ని ఖండించి ‘ఆచార్య’ ఫెయిల్యూర్లో తన ప్రమేయం ఏమీ లేదని చిరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది.