నిన్న ప్రకటించిన 2020 జాతీయ అవార్డుల్లో అల వైకుంఠపురములోకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ ఎంపిక కావడం అభిమానులకు మాములు కిక్ ఇవ్వలేదు. ఇండియన్ ఆస్కార్ గా చెప్పుకునే ఈ పురస్కారాలకు అంత విలువుంది మరి. పైగా దేశవ్యాప్తంగా వచ్చిన సినిమాల మ్యూజిక్ అన్నిటితోనూ పోటీ పడి విజేతగా నిలవడం చిన్న విషయం కాదు. ఏదైనా ఆల్బమ్ లో ఒకటి రెండు పాటలు బాగుంటేనే గొప్పనుకునే ట్రెండ్ లో ఏకంగా అయిదు పాటలను ఛార్ట్ బస్టర్స్ చేసి యుట్యూబ్ ని షేక్ చేయడం తమన్ కే చెల్లింది.
ఇక తమన్ కి ఇది ప్రత్యేకం అని చెప్పడానికి కారణం ఉంది. ఇప్పటిదాక జాతీయ స్థాయిలో సంగీతానికి ఈ గౌరవం దక్కించుకున్న వాళ్ళు తెలుగులో ఆరుగురే ఉన్నారు. శంకరాభరణం(1980)కు మామ కెవి మహదేవన్, మేఘసందేశం(1982)కు రమేష్ నాయుడు, సాగరసంగమం- రుద్రవీణ (1988)కు ఇళయరాజా, అన్నమయ్య(1997)కు కీరవాణి, స్వరాభిషేకం(2004)కు విద్యాసాగర్, మా బంగారు తల్లి(2013)కి శంతను మొయిత్రాలు మాత్రమే టాలీవుడ్ నుంచి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తమన్ తన మొదటి ప్రౌడ్ మూమెంట్ దక్కించుకున్నాడు.
దశాబ్దాల తెలుగు సినిమా ప్రస్థానంలో ఇప్పటిదాకా ఈ పురస్కారం అందుకున్న వాళ్ళు పట్టుమని పది కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా మన టాలెంట్ వైపు ప్రపంచం మొత్తం చూస్తున్న తరుణంలో ఇప్పుడిది జరగడం ఆహ్వానించదగ్గదే. రాబోయే రోజుల్లో ఈ కౌంట్ త్వరగానే పెరిగే సూచనలున్నాయి. అసలు తమన్ ఫామ్ అమాంతం ఎగబాకిందే అల వైకుంఠపురములో నుంచి. ప్రస్తుతం ఇతని చేతిలో గాడ్ ఫాదర్, వారసుడు, రామ్ చరణ్-శంకర్, శివ కార్తికేయన్ ప్రిన్స్, మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో మూవీ లాంటి క్రేజీ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. ఇప్పుడీ ఉత్సాహంతో ఇంకెంత రచ్చ చేస్తాడో.
Gulte Telugu Telugu Political and Movie News Updates