జూలై నెల బాక్సాఫీస్ కు ఇప్పటిదాకా అతి నిస్సారంగా గడిచిపోయింది. మొదటి వారం గోపీచంద్ పక్కా కమర్షియల్ నిరాశపరిస్తే సెకండ్ వీక్ లో హ్యాపీ బర్త్ డే బయ్యర్లకు పీడకల మిగిల్చింది. సరే మూడో వారంలో రామ్ ఎనర్జీ ఇస్తాడనుకుంటే ది వారియర్ రూపంలో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. సరే చైతు ఏమైనా థాంక్ యు చెబుతాడేమో అనుకుంటే ఓపెనింగే పరమ వీక్ గా మొదలయ్యింది. పట్టుమని మూడు కోట్ల గ్రాస్ దాటాకపోవడం ట్రేడ్ ని విస్మయపరుస్తోంది. టాక్ ఎలా ఉన్నా ఈ వసూళ్లు ఆందోళన పుట్టించేవే.
ఇదంతా ఒక ఎత్తయితే వర్షాలు మళ్ళీ మొదలయ్యాయి. హైదరాబాద్ తో సహా నైజామ్ లో వీటి తాకిడి ఎక్కువగా ఉంది. రోడ్ల మీద ట్రాఫిక్ జాములు, నీళ్లు బ్లాక్ అయిపోవడంలాంటి దృశ్యాలు తిరిగి కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనం థియేటర్లకు రావడం గురించి ఎక్కువ కామెంట్ చేయలేం. థాంక్ యు పెర్ఫార్మన్స్ కి ఇది ముఖ్య కారణం కాదు కానీ చూసినవాళ్ల అసంతృప్తి పలురూపాల్లో బయటికి రావడం ఎలాగైనా చూదామనుకుంటున్న ఆడియన్స్ ని ఆపేస్తోంది. ఇంకో మూడు రోజులు రైన్ ఫాల్ తప్పదనే మాట ఇంకో ట్విస్టు.
ఇప్పుడు అందరి చూపు రామారావు ఆన్ డ్యూటీ మీదకు వెళ్తోంది. షూటింగులకు బ్రేక్ ఇచ్చి మరీ రవితేజ వరసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. జూలై ఈ సినిమాతోనే ముగింపుకొస్తుంది. ఒక్కటంటే ఒక్క హిట్టు లేని ఈ నెల స్లంప్ నుంచి మాస్ మహారాజే బయటపడేయాలని డిస్ట్రిబ్యూటర్లు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ చూశాక ఇదీ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనరనే ఫీలింగ్ వచ్చినప్పటికీ క్రాక్ టైపులో కంటెంట్ బలంగా ఉంటే చాలు హిట్టు కొట్టేయొచ్చు. మరి అభిమానులే కాక ఇంతమంది పెట్టుకున్న నమ్మకాన్ని రామారావు నిలబెట్టుకుంటాడా చూడాలి.