దశాబ్దం వెనక్కి వెళ్తే శ్రీను వైట్ల ఊపు మామూలుగా ఉండేది కాదు. అప్పటికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో అతనొకడు. స్టార్ హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి క్యూ కట్టే పరిస్థితి ఉండేది. ‘దూకుడు’ సినిమాతో పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన పది కోట్ల పారితోషకం పుచ్చుకునే అరుదైన దర్శకుల్లో ఒకడిగా ఉన్నాడు. అలాంటి దర్శకుడు దశాబ్దం తిరిగేసరికి ఇప్పుడున్న స్థితి చూస్తే షాకవకుండా ఉండలేం. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ కావడంతో మిడ్ రేంజ్ హీరోలు కూడా వైట్లతో సినిమా చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.
అసలు ఫాంలో లేని మంచు విష్ణుతో ‘ఢీ అండ్ ఢీ’ సినిమాను అనౌన్స్ చేసినా.. అతను కూడా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడంలో ఆలస్యం చేస్తున్నాడు. విష్ణుకు కూడా కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత అతను ‘ఢీ’ సీక్వెలే చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ మధ్యలో ‘జిన్నా’ అని వేరే సినిమాను లైన్లో పెట్టాడు. వైట్లతో సినిమా గురించి ఈ మధ్య అసలు మాట్లాడట్లేదు. దీంతో ఈ సినిమా కూడా క్యాన్సిలైపోయిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. చివరికి విష్ణు కూడా వైట్ల నుంచి దూరం జరిగితే ఇక ఆయన్ని నమ్మి సినిమా చేసేదెవరు అన్నది ప్రశ్నార్థకం. దాదాపుగా వైట్ల సినిమా కెరీర్ క్లోజ్ అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఫిలిం కెరీర్ పరిస్థితి ఇలా ఉంటే.. ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ వైట్ల ఆటుపోట్లు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలొస్తుండం గమనార్హం. వైట్ల నుంచి విడాకుల కోసం ఆయన భార్య రూప పిటిషన్ వేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వైట్ల మంచి ఫాంలో ఉండగానే రూప ఆయన్నుంచి విడిపోవడానికి సిద్ధపడడం, ఆ సమయంలో కొందరు పెద్ద మనుషులు రాజీ చేయడం, తర్వాత వైట్ల సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయడం జరిగింది.
ఐతే మళ్లీ ఇప్పుడు ఏమైందో కానీ.. రూప విడాకుల పిటిషన్ వేసినట్లు వార్తలొస్తున్నాయి. సినిమా కెరీర్ పూర్తిగా దెబ్బ తిన్న ఇలాంటి సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న వైట్లను చూసి అయ్యో అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు తనకు ఎదురే లేనట్లుగా చాలా అగ్రెసివ్‌గా కనిపించిన వైట్లకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. సినీ పరిశ్రమలో ఓడలు బళ్లు-బళ్లు ఓడలు కావడానికి ఎంతో సమయం పట్టదు అనడానికి ఇది ఉదాహరణ.