దిల్ రాజు భ‌య‌ప‌డ్డాడా?

ఈ రోజుల్లో ఏ సినిమా ఆడుతుందో.. ఏ సినిమా పోతుందో అర్థం కాని అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొంది. ప్రేక్ష‌కులు చాలా సెల‌క్టివ్‌గా థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో టాక్ బాగున్న సినిమాలు కూడా కొన్ని థియేట‌ర్లలో నిల‌బ‌డ‌లేక‌పోతున్నాయి. ఏ కార‌ణంతో ఆ సినిమాలు ఆడ‌లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి త‌లెత్తుతోంది. కొన్నిసార్లు నిడివి కూడా స‌మ‌స్య‌గా మారుతున్న సంద‌ర్భాలు క‌నిపిస్తున్నాయి.

ఇటీవ‌లే రిలీజైన నేచుర‌ల్ స్టార్ నాని సినిమా అంటే సుంద‌రానికీ ప‌రిస్థితి ఇలాగే త‌యారైంది. అది తీసిప‌డేయద‌గ్గ సినిమా కాదు. యువ ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ బాగానే క‌స‌ర‌త్తు చేసి కొంచెం భిన్నంగానే సినిమా తీశాడు. నాని న‌జ్రియా కూడా చాలా బాగా న‌టించారు. సినిమాలో చెప్పుకోద‌గ్గ పాజిటివ్స్ ఉన్నాయి. అయినా అది ఆడ‌లేదు. ఈ చిత్రానికి ప్ర‌ధానంగా ఎక్కువ నిడివి, స్లో న‌రేష‌న్ స‌మ‌స్య‌గా మారాయనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఈ నేప‌థ్యంలోనే అగ్ర నిర్మాత దిల్ రాజు త‌న ప్రొడ‌క్ష‌న్లో రాబోతున్న థ్యాంక్ యు సినిమా విష‌యంలో భ‌య‌ప‌డిన‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. ముందు ఈ సినిమా ర‌న్ టైం 2 గంట‌ల 50 నిమిషాల‌ని వార్త‌లొచ్చాయి. తీరా చూస్తే ఇప్పుడు లెంగ్త్ 2 గంట‌ల 9 నిమిషాల‌కు ప‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని చిత్ర‌ ర‌చ‌యిత బీవీఎస్ ర‌వి స్వ‌యంగా ధ్రువీక‌రించాడు. కానీ థ్యాంక్ యు లాంటి ఫీల్ గుడ్ మూవీకి ర‌న్ టైం మరీ అంత త‌క్కువ ఉండ‌డం కూడా క‌రెక్ట్ కాదేమో అన్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

ఇలాంటి చిత్రాలు నెమ్మ‌దిగానే సాగుతాయి. జీవితంలోని వివిధ ద‌శ‌ల‌ను చూపించేట‌పుడు న‌రేష‌న్ స్లోగానే ఉంటుంది. అప్పుడే ఒక‌ ఫీల్ వ‌స్తుంది. ఆ ఫీల్‌కు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయితే లెంగ్త్ అనేది స‌మ‌స్య కాదు. నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు ఆడ‌ట్లేద‌ని కోత‌లు మ‌రీ ఎక్కువ‌గా వేస్తే.. సినిమాలో ఫీల్ దెబ్బ తినొచ్చు. సినిమా వెయ్యాల్సినంత ఇంపాక్ట్ వేయ‌క‌పోవ‌చ్చు. మ‌రి విక్ర‌మ్ కుమార్, దిల్ రాజు క‌లిసి స‌రైన ఔట్‌పుట్‌తోనే సినిమాను రిలీజ్ చేశారో లేదో చూడాలి.