ప్రకాష్ రాజ్.. ఇష్టం లేకుండా ఆ పాత్ర చేశాడా?

ప్ర‌కాష్ రాజ్‌కు విల‌క్ష‌ణ న‌టుడు అనే పేరు ఊరికే రాలేదు. మూడు ద‌శాబ్దాల‌కు పైగా సుదీర్ఘ కెరీర్లో ఆయ‌న ఎన్నో అద్భుత‌మైన‌, వైవిధ్య‌మైన పాత్ర‌లు చేశారు. కానీ అప్పుడ‌ప్పుడూ ఆయ‌న కొన్ని రొటీన్ క్యారెక్ట‌ర్లు కూడా చేయ‌క త‌ప్ప‌లేదు. అవి మొహ‌మాటానికి చేసి ఉండొచ్చు. డ‌బ్బు కోసం చేసి ఉండొచ్చు. కార‌ణాలు ఏవైతేనేం అంద‌రు న‌టుల మాదిరే ప్ర‌కాష్ రాజ్ కూడా త‌న‌కు అంతగా ఇష్టం లేని, రొటీన్ పాత్ర‌లు చాలానే చేశాడు కెరీర్లో.

అలాంటి పాత్ర‌ల్లో మ‌హేష్ బాబు మూవీ స‌రిలేరు నీకెవ్వ‌రులో చేసిన విల‌న్ పాత్ర కూడా ఒక‌ట‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో భాగంగా మీరు చేసిన పాత్ర‌ల్లో క‌ష్టంగా అనిపించిన‌వి ఏవి అని అడిగితే.. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో అబ‌ద్ధాలు చెప్పే పాత్ర‌ల్లో, స‌న్నివేశాల్లో న‌టించ‌డం త‌న‌కు చాలా క‌ష్టంగా అనిపించింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

ఒక మూస త‌రహాలో సాగే సినిమాలు చేయ‌డం అంటే త‌న‌కు ఆస‌క్తి ఉండ‌ద‌ని.. కానీ ఏదో త‌ప్ప‌క చేస్తామ‌ని, అక్క‌డ మ‌న ఆలోచ‌న‌ల‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని, పాత్ర‌లో లీనం కామ‌ని ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. త‌న వ‌ర‌కు కాంజివ‌రం, ఆకాశ‌మంత‌, బొమ్మ‌రిల్లు, మేజ‌ర్ లాంటి సినిమాల్లో చేసిన పాత్ర‌లు చాలా ఇష్ట‌మ‌ని.. అలాంటి సినిమాల్లో ఒక లైఫ్ ఉంటుంద‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నాడు. మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర‌లు వ‌చ్చిన‌పుడు తాను త‌క్కువ పారితోష‌కం తీసుకుని న‌టిస్తాన‌ని ప్ర‌కాష్ రాజ్ చెప్పాడు.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటూ, న‌చ్చిన సినిమాల‌కు త‌క్కువ పుచ్చుకుంటాన‌ని.. ఇలా స‌మ‌తూకం పాటిస్తుంటాన‌ని చెప్పాడాయ‌న‌. మ‌హేష్ హీరోగా చేసిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో విల‌న్ పాత్ర చేశాక‌ ఆయ‌న ప్రొడ‌క్ష‌న్లోనే తెర‌కెక్కిన మేజ‌ర్ మూవీ చేసి బ్యాలెన్స్ చేసిన‌ట్లుగా ప్ర‌కాష్ రాజ్ చెప్పాడు. మేజ‌ర్ సినిమాలో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ తండ్రి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.