‘వారియర్’ను వాయిదా వేద్దామనుకుని..

యువ కథానాయకుడు రామ్ లీడ్ రోల్ చేసిన కొత్త సినిమా ‘ది వారియర్’ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి రూపొందించిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుని, ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోంది. నిజానికి రామ్ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది.

మామూలుగానే బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా మారగా.. వర్షాలు ఆ సినిమా ఓపెనింగ్స్ మీద ప్రతికూల ప్రభావం చూపాయి. రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్న సమయంలో ఇలాంటి క్రేజున్న సినిమాను రిలీజ్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోలేదు. కానీ ముందుగానే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, ప్రమోషన్లు అన్నీ గట్టిగా చేసి, విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో సినిమాను థియేటర్లలోకి దించక తప్పలేదు.

ఐతే వారం రోజులుగా పరిస్థితి చూశాక అయినా వెనక్కి తగ్గాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. నిజానికి తమ టీం కూడా సినిమాను వాయిదా వేయాలన్న ఆలోచన చేసినట్లు రామ్ వెల్లడించాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేశామని, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయని అతను తెలిపాడు.

“ది వారియర్ సినిమా విడుదల సమయంలో వర్షాలు ఉన్నాయి. అడ్డంకులు చాలా వచ్చాయి. చివరి నిమిషంలో డిజిటల్ ప్రింట్స్ వెళ్ళే వరకూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. మా టీమ్ అంతా వారియర్స్‌లా నిలబడ్డారు. చివరికి ఎలాగోలా కష్టపడి రిలీజ్ చేశారు. ఇలాంటి స్థితిలో సినిమాను సవ్యంగా రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్ అనుకున్నా. పరిస్థితులు ఇలా ఉన్నపుడు ఎవరికైనా సరే సినిమా విడుదల చేయాలా వద్దా అనే సందేహం వస్తుంది. కానీ కొవిడ్ వచ్చినా… వర్షాలు వచ్చినా… ఏం వచ్చినా… జనం థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని ‘ది వారియర్’ మరోసారి రుజువు చేసింది. వర్షాలు చూసి సినిమా వాయిదా వేయాలా అనే ఆలోచనలో పడ్డాం. కానీ, మేం గట్టిగా నమ్మాం. ప్రేక్షకులు వస్తారని అనుకున్నాం. తొలి రోజు అదే రుజువైంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొంత మంది ప్రేక్షకులు సినిమా చూడలేకపోయారు. వాళ్ళందరూ కూడా సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అని రామ్ తెలిపాడు.