క‌బాలి ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్

కెరీర్లో ఒక ద‌శ దాటాక ఎక్కువ‌గా సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌తోనే ప‌ని చేసిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్.. కేవ‌లం రెండే రెండు సినిమాల అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిని న‌మ్మి వ‌రుస‌గా రెండు సినిమాలు చేశాడు. కానీ ఆ అద్భుత అవ‌కాశాన్ని ఆ ద‌ర్శ‌కుడు ఉప‌యోగించుకోక‌పోగా.. ర‌జినీకాంత్ క్రేజును, మార్కెట్‌ను దెబ్బ తీశాడు. ఈ ఉపోద్ఘాతం పా రంజిత్ గురించే అని ఈపాటికే అర్థ‌మైపోయి ఉంటుంది. సూప‌ర్ స్టార్‌తో అత‌ను చేసిన తొలి చిత్రం క‌బాలి అంచ‌నాల‌ను అందుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డింది.

ఐతే ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయినా వ‌చ్చాయి. కానీ రంజిత్‌ను న‌మ్మి ర‌జినీ అత‌డితో చేసిన రెండో చిత్రం కాలాకు అది కూడా లేదు. ఈ దెబ్బ‌తో ర‌జినీ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఆ త‌ర్వాత ఆయ‌న కోలుకోలేక‌పోయారు. క‌బాలి, కాలా సినిమాల‌తో రంజిత్ ట్రాక్ రికార్డు కూడా దెబ్బ తింది. ఆ త‌ర్వాత అత‌డి కెరీర్లో చాలా గ్యాప్ వ‌చ్చింది. చివ‌ర‌గా సార్ప‌ట్ట అనే సినిమా తీస్తే అది ఓటీటీలో విడుద‌లై ఓకే అనిపించింది.

సార్ప‌ట్ట త‌ర్వాత మ‌ళ్లీ గ్యాప్ తీసుకున్న రంజిత్.. ఇప్పుడు మ‌రో సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ అయిన విక్ర‌మ్‌తో జ‌ట్టు క‌డుతున్నాడు. విక్ర‌మ్ త‌న స్థాయికి త‌గ్గ హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అత‌డి చివ‌రి సినిమా మ‌హాన్ కూడా ఓటీటీలోనే రిలీజైంది. రెస్పాన్స్ ప‌ర్వాలేదు. త్వ‌ర‌లోనే అత‌ను కోబ్రా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అది విడుద‌ల కాక‌ముందే పా.రంజిత్‌తో సినిమా మొద‌లుపెట్టాడు. ఈ చిత్రాన్ని సూర్య క‌జిన్ జ్ఞాన‌వేల్ రాజా నిర్మించ‌బోతున్నాడు. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీత ద‌ర్శ‌కుడు. శ‌నివారం ఈ సినిమా ప్రారంభోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. బ‌హు భాష‌ల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

రంజిత్ సినిమాలంటే చాలా వ‌ర‌కు శ్రామిక వ‌ర్గం గురించే ఉంటాయి. ఇది కూడా ఆ టైపు సినిమానేన‌ట‌. కేజీఎఫ్ లాంటి గ‌నిలో ప‌ని చేసే కార్మికుల హ‌క్కుల చుట్టూ న‌డుస్తుంద‌ట‌. ఇదొక పీరియ‌డ్ ఫిలిం అంటున్నారు. మ‌రి విక్ర‌మ్‌తో అయినా రంజిత్ మంచి జ‌న‌రంజ‌కమైన సినిమా తీస్తాడా.. లేక త‌న రూట్లోనే సాగిపోతాడా అన్న‌ది చూడాలి.