తాప్సీ సినిమాలో శభాష్ లేదు

స్పోర్ట్స్ డ్రామాలు వద్దు మొర్రో అని ఆడియన్స్ మొత్తుకుంటున్నా సరే బాలీవుడ్ మేకర్స్ మాత్రం వదిలే ప్రసక్తే లేదంటున్నారు. నిన్న తాప్సీ టైటిల్ రోల్ పోషించిన శబాష్ మితు థియేటర్లలో అడుగు పెట్టింది. ముందు నుంచి ఏమైంత బజ్ లేదు కానీ ఏదైనా ఇంటరెస్టింగ్ కంటెంట్ ఉండకపోదాని మూవీ లవర్స్ ఎదురు చూశారు. కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ సినిమా శభాష్ అందుకోవడంలో ఫెయిలయ్యింది. చాలా వీక్ ఓపెనింగ్స్ తో మొదలైనప్పటికీ మౌత్ టాక్ మీద నమ్మకంతో టీమ్ ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చింది.

సుదీర్ఘమైన కెరీర్ కలిగిన ఏకైక మహిళగా మిథాలీ రాజ్ ప్రస్థానం చాలా గొప్పదే. ఇటీవలే రిటైర్ మెంట్ ప్రకటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలు పంపడం చూశాం. ప్రపంచవ్యాప్తంగా తన క్రీడకు ఫ్యాన్స్ గొప్ప వీడ్కోలు పలికారు. అందుకే మిథాలీ జీవిత కథ ఆధారంగా సినిమాను ప్రకటించినప్పుడు దీని మీద అంతో ఇంతో బజ్ ఏర్పడిన మాట వాస్తవం. అయితే దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ సెకండ్ హాఫ్ డ్రామాని పండించడంలో తడబడటంతో విపరీతమైన ల్యాగ్ అసహనానికి గురి చేసింది.

ముఖ్యంగా క్రికెటర్ గా తాప్సీ ఆ పాత్ర కోసం బాగా కష్టపడినప్పటికీ తను అంతగా మ్యాచ్ కాలేకపోయింది. దానికి తోడు ఎంఎస్ ధోని, అజర్, సచిన్, జెర్సీ తదితర చిత్రాల్లో ఆడియన్స్ బోలెడంత క్రికెట్ ని తెరమీద చూసేశారు. అలాంటప్పుడు ఆ క్రీడను మరింత రక్తికట్టించేలా చూపించాలి. కానీ అదేమీ జరగలేదు. అన్ని స్పోర్ట్ మూవీస్ లో చూసినట్టే ఇందులోనూ అవే మలుపులు ఉండటం నిరాశపరుస్తుంది. ఓటిటిలో వచ్చి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదేమో కానీ థియేటర్ కావడంతో నిట్టూర్పు తప్పలేదు మరి.