కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని నిన్న కేరళ హైకోర్టు జస్టిస్ బేచు కురియన్ థామస్ రెండు వారాల పాటు వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అభ్యంతరాలు వ్యక్తం చేసిన పిటీషనర్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సదరు టీమ్ కి పెద్ద షాక్ ఇచ్చారు.

అయితే అప్పీల్ కు వెళ్లిన దర్శక నిర్మాతలకు డివిజన్ బెంచ్ జడ్జీలు ధర్మాధికారి, బాలకృష్ణన్ ఊరట కలిగించారు. పదిహేను రోజుల నిషేధాన్ని ఎత్తి వేస్తూ తాజాగా మరో ఆదేశాన్ని జారీ చేశారు. దీంతో కేరళ స్టోరీ 2 థియేటర్లలో అడుగు పెట్టేందుకు రూట్ క్లియరయ్యింది.

ఇప్పటికిప్పుడు దీనికి వ్యతిరేకంగా ఎవరైనా సుప్రీమ్ కోర్టుకు వెళ్తే తప్ప కేరళ స్టోరీ 2 ఆగదు. ఈ రోజు షోలకు సంబంధించి దేశవ్యాప్తంగా అడ్వాన్స్ టికెట్లు కొన్న వాళ్లకు బుకింగ్ యాప్స్ ఇప్పటికే సొమ్ములు రీ ఫండ్ చేస్తుండగా మళ్ళీ ఫ్రెష్ గా అమ్మకాలు మొదలుపెడతారు.

అయితే దీనికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. నిర్మాణ సంస్థ వైపు నుంచి చూసుకుంటే కొత్తగా వచ్చిన కోర్ట్ ఆర్డర్ వాళ్లకు సానుకూలంగా ఉంది. దీన్ని ఇంకా ఎవరూ సవాల్ చేయలేదు. ఎవరైనా చొరవ తీసుకుని ఒకవేళ చేయాల్సి వస్తే అప్పటికప్పుడు సినిమాను ఆపే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది.

కేరళ స్టోరీ 2కున్న అతి పెద్ద అడ్వాంటేజ్ సెన్సార్ అయిపోవడం. సిబిఎఫ్సి అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చేసింది కాబట్టి లీగల్ గా ప్రొడ్యూసర్ కు విడుదల చేసే హక్కు ఉంది. కానీ కోర్టు కేసులు అడ్డుపడితే మాత్రం అతనైనా ఏం చేయలేడు. జన నాయకుడు విషయంలో రెండు నెలల నుంచి సదరు నిర్మాత పడుతున్న ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం.

కేరళ 2 లాంటి ప్రాపగండా సినిమాకు కావాలని సానుకూలంగా వ్యవహరిస్తున్నారని కొందరు నెటిజెన్లు కామెంట్ చేస్తుండగా సినిమా చూశాక విమర్శలు చేయొచ్చని, నిజాలే చూపించామని నిర్మాత విపుల్ అమృత్ షా అంటున్నారు. చూడాలి ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.