మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు ఫిక్స్ అవ్వకుండానే టైటిల్ రిజిస్టర్ చేసుకుంది. ఇంకో ప్రొడ్యూసర్ కేవలం పండగని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో స్టోరీ రాసుకుంటున్నారు.

ఇది మిస్ చేసుకుంటే తమ సినిమా బ్రతికి బట్టకట్టదన్న రేంజ్ లో కొందరు పడుతున్న హడావుడి చూస్తుంటే ఇది ఎక్కడిదాకా పోతుందోనని ట్రేడ్ టెన్షన్ పడుతోంది. వరసగా ప్రతి పండక్కు రావిపూడి బ్లాక్ బస్టర్లు కొట్టడం, వినోదంతో వసూళ్ల సునామి రప్పించడం చూసి చాలా మంది స్ఫూర్తి చెందుతున్నారు. తన లాగా అందరికీ ఆ మేజిక్ సాధ్యం కాదు. అయితే మెరిసేదంతా బంగారం కాదు. వసూళ్లన్నీ సంక్రాంతికే రావు.

ఒకసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే చరిత్రలో మర్చిపోలేని డిజాస్టర్లు కూడా ఇదే సంక్రాంతికి వచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, చిరంజీవి మృగరాజు, బాలకృష్ణ పరమవీరచక్ర, ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్ వినయ విధేయ రామ, శంకర్ ఐ, మహేష్ బాబు 1 నేనొక్కడినే, ఒక్క మగాడు, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, పోస్ట్ మ్యాన్, అంగరక్షకుడు, జూనియర్ ఎన్టీఆర్ నా అల్లుడు, నాగ, ప్రభాస్ యోగి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు హిస్టరీలో కనిపిస్తాయి. వీటిలో అత్యధిక శాతం బ్రేక్ ఈవెన్ కానివే ఉంటాయి. పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ వాడుకోలేకపోయిన కంటెంట్లుగా చెప్పుకోవచ్చు.

ఇదంతా తెలిసి కూడా కేవలం సంక్రాంతి మీద వ్యామోహంతో సినిమాలు తీసి అవసరం లేని పోటీకి దిగడం చాలా రిస్కులో పడేస్తుంది. మొన్న నారి నారి నడుమ మురారికి రావాల్సిన కలెక్షన్లు తగ్గడానికి కారణం ఒకటే. సరిపడా స్క్రీన్లు లేకపోవడమే.

అయిదు సినిమాల్లో రెండు తప్పుకుని జనవరి నెలాఖరుకు వచ్చి ఉంటే అందరు నిర్మాతలు ఇంకా మెరుగైన లాభాలు చూసేవాళ్ళు. కంటెంట్ బాగుంటే సీజన్ తో సంబంధం లేకుండా అద్భుతాలు చేయొచ్చని బాక్సాఫీస్ ఎన్నోసార్లు ఋజువు చేసింది. అయినా సంక్రాంతి విడుదలే పరమావధిగా భావించి తప్పటడుగులు వేస్తే ఎవరో ఒకరు తీవ్రంగా నష్టపోక తప్పదు.