నీళ్ల ట్యాంక్ దాహం తీర్చిందా

కాళిదాసుతో హీరోగా పరిచయమైనప్పుడు అక్కినేని సపోర్ట్ ఉంది కాబట్టి సుశాంత్ హీరోగా సెటిలవుతాడనే నమ్మకం నాగ్ ఫ్యాన్స్ లో ఉండేది. కానీ వరస ఫెయిల్యూర్స్ పలకరించడంతో అతనికి మార్కెట్ ఏర్పడలేదు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని అల వైకుంఠపురములోతో సపోర్టింగ్ క్యారెక్టర్ లో కనిపించి సబ్జెక్టు నచ్చితే ఏదైనా చేస్తాననే సందేశం ఇచ్చాడు. తాజాగా వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ వరల్డ్ లో అడుగు పెట్టేశాడు. మా నీళ్ల ట్యాంక్ పేరుతో వరుడు కావలెను ఫేమ్ లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇవాళ స్ట్రీమ్ అయ్యింది.

నచ్చిన అమ్మాయి(ప్రియా ఆనంద్) పెళ్ళికి ఒప్పుకోలేదని ఓ కుర్రాడు(సుదర్శన్) నీళ్ల ట్యాంక్ ఎక్కి చచ్చిపోతానని బెదిరిస్తాడు. అతని తండ్రే ఊరి సర్పంచ్. ఎలాగైనా ఆ పిల్లను పట్టుకొచ్సి తన కొడుకు ప్రాణాలు కాపాడమని ఓ పోలీస్(సుశాంత్) సహాయం కోరతాడు. ఆ కుర్ర ఆఫీసర్ రంగంలో దిగి ఈ సమస్యను ఎలా పరిష్కరించాడనేదే ఈ కథలోని మెయిన్ పాయింట్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వినోదాత్మకంగా దీన్ని రూపొందించే ప్రయత్నం చేసింది దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. క్యాస్టింగ్ వగైరా అంతా సబ్జెక్టుకు తగ్గట్టు బాగానే కుదిరారు.

అయితే ఓ గంటన్నర నిడివితో చెప్పాల్సిన నెరేషన్ ని సిరీస్ కోసమని ఎనిమిది ఎపిసోడ్లుగా సాగదీయడంతో నీళ్ల ట్యాంక్ లో హాస్యం కన్నా సాగతీత ఎక్కువయ్యింది. టేకాఫ్ చక్కగా ఉన్నప్పటికీ, ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు ఓ మోస్తరుగా నవ్వించినప్పటికీ తర్వాతి కంటెంట్ వీకై పోయింది. దీనికి తోడు క్లైమాక్స్ కూడా చప్పగా ఉండటం నిరాశపరుస్తుంది. సుశాంత్ హుషారుగా చేశాడు. ప్రియా ఆనంద్ గ్లామర్ ని వయసు తగ్గించేసింది. నిడివి ఎక్కువగా ఉండటాన్ని ఫార్వార్డ్ బటన్ రక్షిస్తుంది కానీ ఫైనల్ గా మంచి టైం పాస్ స్టఫ్ అనిపించుకోవడంలో నీళ్ల ట్యాంక్ ఫెయిలయ్యింది. దాహం తీర్చలేదు సరికదా ఇంకాస్త పెంచేందుకే సరిపోయింది.