షేక్ చేస్తున్న విక్ర‌మ్

థియేట్రిక‌ల్ రిలీజ్ అయి నెల రోజులు దాటిపోయింది. ఇంకా విక్ర‌మ్ సినిమా షేక్ చేయ‌డ‌మేంటి అనిపిస్తోందా? బాక్సాఫిస్ ద‌గ్గ‌ర ప్ర‌కంప‌న‌లు రేపిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోనూ సంచ‌ల‌నం రేపుతోంది. విడుద‌ల‌కు ముందే హాట్ స్టార్ సంస్థ‌ ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అన్ని భాష‌ల‌కూ క‌లిపి రూ.125 కోట్లు ప‌లికాయి ఆ హ‌క్కులు. ఫాంలో లేని క‌మ‌ల్ న‌టించిన సినిమా మీద ఇంత న‌మ్మ‌క‌మా అని అప్పుడు అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. కానీ ఆ రేటుతో హాట్ స్టార్ సంస్థ జాక్ పాట్ కొట్టింద‌నే చెప్పాలి. ఈ సినిమాకు ఓటీటీలో వ‌స్తున్న స్పంద‌న అలా ఉంది మ‌రి.

ఇప్పటిదాకా హాట్ స్టార్ ఓటీటీలో వ్యూయ‌ర్ షిప్ ప‌రంగా అన్ని రికార్డుల‌నూ విక్ర‌మ్ బ‌ద్ద‌లు కొట్టేయ‌డం విశేషం. గ‌త గురువారం అర్ధ‌రాత్రి నుంచి విక్ర‌మ్ స్ట్రీమింగ్ మొద‌లు కాగా.. ఒక‌ వీకెండ్లో హాట్ స్టార్‌లో అత్య‌ధిక వ్యూయ‌ర్ షిప్ తెచ్చుకున్న సినిమాగా అది రికార్డుల‌కెక్కింది. హాట్ స్టార్ సంస్థ ఇంకా ఎక్కువ రేటు పెట్టి కొన్న హిందీ చిత్రాల‌ను కొని రిలీజ్ చేసింది. కానీ ఆ సినిమాల‌ను మించి విక్ర‌మ్ వ్యూస్ తెచ్చుకుంద‌ట‌.

విక్ర‌మ్ సినిమా ప్ర‌త్యేకత ఏంటంటే.. అది రిపీట్ వాల్యూ ఉన్న సినిమా. థియేట‌ర్ల‌లో చూసిన వాళ్లంద‌రూ కూడా క‌చ్చితంగా ఇంకోసారి చూడాల‌నిపించే విష‌యం ఉందా చిత్రంలో. అంత డీటైలింగ్, రిపీట్ వాల్యూ ఉన్న సీన్లు ఆ సినిమాలో ఉన్నాయి. ఇక థియేట‌ర్ల‌లో చూడ‌లేని వాళ్లు చాలా ఉత్కంఠ‌గా డిజిట‌ల్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు అంద‌రూ క‌లిసి హాట్ స్టార్ మీద ప‌డిపోయారు.

సినిమా స్ట్రీమింగ్ మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచి సోష‌ల్ మీడియా హీటెక్కిపోతోంది. థియేట‌ర్ల‌లో ఓ కొత్త సినిమా రిలీజైన రేంజిలో సోష‌ల్ మీడియాలో విక్ర‌మ్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందులో యాక్ష‌న్ సీన్లు, అలాగే అనిరుధ్ బీజీఎం గురించి ఒక యుఫోరియా న‌డుస్తోంది సోష‌ల్ మీడియాలో. కాబ‌ట్టి హాట్ స్టార్‌లో రికార్డులు బ‌ద్ద‌ల‌వ‌డంలో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు.