హమ్మయ్య .. ఆ రీమేక్ వద్దట

కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ వరసబెట్టి రీమేకులు చేయడం అభిమానులకే రుచించడం లేదు. ఆల్రెడీ వేరే భాషల్లో ఆడేసినవి ఓటిటిలో జనం చూసేస్తుండగా మళ్ళీ వాటినే తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం ఎందుకనేది వాళ్ళ బాధ. అందులో లాజిక్ లేకపోలేదు. ఈ కారణంగానే కంటెంట్ ఎంత బలంగా ఉన్నా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు వంద కోట్ల షేర్ ను అందుకోలేకపోయాయి. తెలుగు ఆడియన్స్ కోసం చేసిన మార్పులు సరిగా సింక్ అవ్వకపోవడం వీటి ఫలితాలను శాశించింది. అయితే ఈ ప్రవాహం ఇక్కడితో ఆగడం లేదు.

వినోదయ సితం రీమేక్ కు అడుగులు వేగంగా పడుతున్నాయి. సాయి తేజ్ డేట్స్ లాక్ చేసుకున్నారు. పవన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న జనవాణి ప్రోగ్రాంకు బ్రేక్ ఇచ్చాక ఆయన కాల్ షీట్స్ తీసుకుని షెడ్యూల్ చేయబోతున్నారు. దర్శకత్వం వహించాల్సిన సముతిరఖని ఆర్టిస్టుగా యమా బిజీగా ఉండటంతో తను దొరకడం అన్నిటి కన్నా ముఖ్యం. హరిహర వీరమల్లు ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ దానికన్నా ముందే ఇదే ఫాస్ట్ గా పూర్తయినా ఆశ్చర్యం లేదు. మరి పవన్ వద్దనుకున్న రీమేక్ ముచ్చట వేరే ఉంది.

తమిళ హీరో విజయ్ నటించిన తేరి గుర్తుందిగా. దాన్ని తెలుగులో పోలీసోడుగా డబ్ చేస్తే ఆడలేదు. తర్వాత ఎప్పుడో ఓటిటికి శాటిలైట్ ఛానల్స్ కి ఇచ్చేశారు. మనవాళ్ళు చూసేశారు కూడా. ఆ తేరిని సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో చేయాలని ఒక దశలో అనుకున్నారు. కానీ ఇప్పుడా ప్రతిపాదన పూర్తిగా డ్రాప్ అయ్యారట. 2024 ఎన్నికలు ఎంత దూరంలో లేవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇది చేయకపోవడమే ఫ్యాన్స్ కి పెద్ద శుభవార్త. లేకపోతే మరో కాటమరాయుడు వచ్చేదని భయపడ్డారు.