టికెట్ల రేట్లు.. నా డిపార్ట్‌మెంట్ కాదు-రామ్

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది ఏపీలో టికెట్ల రేట్లు తగ్గించడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు గగ్గోలు పెట్టాయి. కానీ తర్వాత వాళ్లు కోరుకున్న దాని కంటే ఎక్కువగా రేట్లు పెంచేయడం సమస్యగా మారింది.

ఇక తెలంగాణలో అయితే ధరలు మరీ ఎక్కువైపోయి థియేటర్లకు జనాలు రాని పరిస్థితి తలెత్తింది. అసలే రేట్లు ఎక్కువ అంటే.. పెద్ద సినిమాలకు అదనంగా వడ్డిస్తున్నారు. మరోవైపు చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు సాధారణ రేట్లు కూడా తలకు మించిన భారం అయ్యాయి.

థియేటర్లలో ఆక్యుపెన్సీ అంతకంతకూ పడిపోతోంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలకు రేట్లు తగ్గించి, ఆ విషయాన్ని ప్రచారం చేసుకోవడం చూస్తున్నాం. కాగా ఈ వారం విడుదల కాబోతున్న రామ్ సినిమా ‘ది వారియర్’కు రేట్లేమీ తగ్గించలేదు.

ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపితే తెలంగాణ సింగిల్ స్క్రీన్లలో రూ.200, మల్టీప్లెక్సుల్లో రూ.330గా ఉన్నాయి టికెట్ల ధరలు. ఈ రేట్లు సినిమాకు చేటు చేస్తాయనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఇదే విషయం హీరో రామ్‌ను ‘ది వారియర్’ ప్రమోషన్ల సందర్భంగా మీడియా వాళ్లు అడిగితే.. దీంతో తనకు సంబంధం లేదన్నట్లు మాట్లాడాడు. ‘‘టికెట్ల రేట్లు నా డిపార్ట్‌మెంట్‌ కాదు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడను’’ అంటూ సమాధానం దాటవేశాడు రామ్.

కానీ హీరోలు పూనుకుని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడి రేట్లు తగ్గిస్తే తప్ప కష్టమని, థియేటర్లకు వచ్చే జనం సంఖ్య మరింత తగ్గిపోతుందని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఫామ్‌లో లేని తమిళ దర్శకుడు లింగుస్వామితో మీరెందుకు సినిమా చేశారు అని రామ్‌ను అడిగితే.. ‘‘ఇస్మార్ట్ శంకర్‌కు ముందు పూరి జగన్నాథ్ గారి పరిస్థితి ఏంటి? నేను ఫామ్ గురించే ఆలోచించి ఉంటే ఆ సినిమా వచ్చేది కాదు.

పూరి గారైనా, లింగుస్వామి గారైనా గొప్ప దర్శకులు. వాళ్ల విషయంలో ఫామ్ గురించి ఆలోచించకూడదు’’ అని రామ్ అన్నాడు. ఇక వరుసగా యాక్షన్, మాస్ టచ్ ఉన్న సినిమాలు చేయడం గురించి రామ్ స్పందిస్తూ.. ఒక దశలో వరుసగా రొమాంటిక్ సినిమాలే చేశానని.. జానర్ మార్చాలని నిర్ణయించుకుని ‘ఇస్మార్ట్ శంకర్’ చేశానని.. మున్ముందు కూడా యాక్షన్ సినిమాలే చేయాలనుకుంటున్నానని, మధ్యలో ఏవైనా వెరైటీ సబ్జెక్టులు వస్తే అవి కూడా చేస్తానని రామ్ తెలిపాడు.