పరభాషా కథానాయిక అయినప్పటికీ తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదంచుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది సాయిపల్లవి. కేవలం ఆమె కోసం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే జనం మన దగ్గర పెద్ద మొత్తంలోనే ఉన్నారు. కాకపోతే వాళ్లలో మెజారిటీ జనాలు సాయిపల్లవి నుంచి ఆశించేది ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లే. తనకు చాలామంది అభిమానులుగా మారింది కూడా ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తను చేసి అల్లరితోనే. కానీ ఆ తర్వాత ఆమె ఆ స్థాయి వినోదాత్మక పాత్రలు చేయలేదు. ఎక్కువగా సీరియస్ క్యారెక్టర్లకే పరిమితం అవుతోంది.
ముఖ్యంగా గత ఏడాది కాలంలో రిలీజైన లవ్ స్టోరి, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం చిత్రాలను గమనిస్తే తన క్యారెక్టర్లు మరీ సీరియస్‌గా, బాధ పెట్టేలా ఉన్నాయి. ఇప్పుడు ఆమె నుంచి రాబోతున్న గార్గి కూడా ఆ టైపు సినిమాలాగే ఉంది. మరి అభిమానుల ఆకాంక్షలు పట్టవా.. ఇంకా ఇలాంటి సీరియస్ సినిమాలే ఎన్ని చేస్తారు అనే ప్రశ్న.. మీడియా నుంచి సాయిపల్లవికి ఎదురైంది.
దీనికి ఆమె బదులిస్తూ.. అవును. వరుసగా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. వీటికి బ్రేక్ ఇవ్వాలనిపిస్తోంది. సరదాగా ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనుంది. ఈ మధ్య మంచి డాన్స్ నంబర్ కూడా పడలేదు. రెండుమూడు సినిమాల నుంచీ.. డాన్స్ పాటలేం చేయలేదు. దానిని చాలా మిస్ అవుతున్నా. త్వరలోనే అదిరిపోయే డాన్స్ నెంబర్ చేయాలని ఉంది. వచ్చే సినిమాతో తప్పకుండా ఆ లోటు తీర్చుకొంటాను. అని సాయిపల్లవి చెప్పింది. దీన్ని బట్టి అభిమానులే కాదు.. సాయిపల్లవి సైతం సీరియస్ క్యారెక్టర్లతో విసుగెత్తిపోయిందని అర్థమవుతోంది.
ఇక ఇటీవలే కశ్మీర్ ఫైల్స్ సినిమా, గో రక్షకుల గురించి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఆమెపై భజరంగ్ దళ్ ప్రతినిధులు కేసు పెట్టడం తెలిసిందే. కాగా తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు సాయిపల్లవి చెప్పింది. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకన్నందుకు బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విరాటపర్వం సినిమాలో వెన్నెల పాత్ర చేసినందుకు గర్వపడుతున్నానని, కానీ ఇలాంటి సినిమాలు బాగా ఆడితే ఆ తరహా కథలు మరిన్ని తెరపైకి వస్తాయని సాయిపల్లవి పేర్కొంది.