మళ్లీ ప్రభాస్‌తో రానా?

‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. ఆ చిత్రంలో అతడి మ్యాన్లీ లుక్స్ చూసి బాలీవుడ్ వాళ్లు కూడా మెస్మరైజ్ అయిపోయారు. బాహుబలి అనే వాడు చేసిన విన్యాసాలు అతిగా అనిపించకుండా.. నిజంగా అతనో యోధుడు అనే భావన కలిగిందంటే అందుకు ప్రభాస్ లుక్స్, ఫిజిక్ కారణం.

ఐతే కథానాయకుడు ఎంతటి యోధుడిగా కనిపించినప్పటికీ.. అవతల ప్రతినాయకుడు కూడా బలంగా ఉంటేనే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. ‘బాహుబలి’లో హీరో పాత్ర అంతగా పండటానికి అవతల భల్లాలదేవుడిగా రానా దగ్గుబాటి దీటుగా నిలబడటం ముఖ్య కారణం. ఆ సినిమాతో రానా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రంలో ప్రభాస్-రానాల కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఈ సినిమా తర్వాత ఎవరి దారిలో వాళ్లు ప్రయత్నిస్తున్నారు ప్రభాస్, రానా. ఐతే ఈ ఇద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. అది.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రంలోనే అని వార్తలొస్తున్నాయి. ఐతే ఇందులో రానా చేయబోయేది పూర్తి స్థాయి పాత్ర కాదట. కేవలం రెండు మూడు నిమిషాల పాటు క్యామియో తరహా రోల్‌లో రానా కనిపిస్తాడట.

‘బాహుబలి’ అనుభవం దృష్ట్యా రానా ఇలాంటి క్యామియో చేస్తే ప్రభాస్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావించి అతణ్ని ఇందులో నటింపజేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయ్యాక రానా పాత్ర తాలూకు చిత్రీకరణ జరుపుతారట. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ వాళ్లతో కలిసి ప్రభాస్ పెదనాన్న సంస్థ ‘గోపీకృష్ణ మూవీస్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.