సూర్యతో దుల్కర్ – ఇది కాంబో అంటే

మూడేళ్ళ క్రితం కర్ణాటకలో తప్ప బయట అంతగా ఎవరికి తెలియని నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ కెజిఎఫ్ పుణ్యమాని ప్యాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించేసుకుంది. అది కురిపించిన కనకవర్షం వల్లే ప్రభాస్ తో సలార్ లాంటి గ్రాండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఇది కాకుండా అటు మలయాళం ఇటు తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా పృథ్విరాజ్ సుకుమారన్ తో ఆల్రెడీ ఓ సినిమా స్టార్ చేశారు

మరోవైపు ఇంకో భారీ మల్టీ స్టారర్ ని త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. సూర్య దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. దీనికి దర్శకురాలు సుధా కొంగర. ఇది గతంలోనే అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ కాంబినేషన్ గురించి చెప్పలేదు. తాజాగా లీకైన అప్డేట్ ని బట్టి చూస్తే ఇందులో దుల్కర్ భాగమవ్వడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది. ఆకాశం నీ హద్దురాలో సుధా కొంగర టేకింగ్ కు ఫిదా అయిపోయిన సూర్య ఆవిడ అడగ్గానే కథ కూడా వినకుండా ఓకే చెప్పారట.

ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. బడ్జెట్ కూడా పెద్ద స్కేల్ లోనే ఉండబోతోంది. ఆ మధ్య వరస ఫ్లాపులతో సతమతమైన సూర్యకు ఆకాశం నీ హద్దురా, జైభీమ్ లు ఓటిటిలో వచ్చినప్పటికీ వాటికి వచ్చిన స్పందన బోలెడు ఎనర్జీ ఇచ్చింది. ఈటి తెలుగులో డిజాస్టర్ అయ్యింది కానీ తమిళంలో ఓ మోస్తరుగా కమర్షియల్ సేఫ్ అనిపించుకుంది. ఇక దుల్కర్ సీతా రామమ్ తో సోలో హీరోగా టాలీవుడ్ డెబ్యూ చేయబోతున్నాడు. ఈ కాంబో అంటే టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంటుందని వేరే చెప్పాలా.