ట్యుటోరియల్ పేరుతో భయపెట్టేశారు

వారానికో కొత్త సినిమా స్ట్రీమింగ్ చేస్తామని హామీ ఇచ్చిన ఆహా యాప్ ఆ మాట మీద నిలబడనప్పటికీ ఏదో ఒక కంటెంట్ ఇచ్చేలా ప్లానింగ్ చేసుకుంటోంది. అందులో భాగంగా ఇటీవలే విడుదలైన వెబ్ సిరీస్ అన్యస్ ట్యుటోరియల్. ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించడంతో హారర్ లవర్స్ ఓ లుక్ వేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఈ మధ్య దెయ్యాలు భూతాల కాన్సెప్ట్ లకి జనం అంతగా భయపడటం లేదు. లారెన్స్ లాంటి వాళ్ళ పుణ్యమాని ఈ జానర్ కూడా ఎప్పుడో కామెడీగా మారిపోయింది. మరి ఈ అన్యస్ ఏం చేసిందనే ఆసక్తి కలగడం సహజం.

ఇది ఒకరంటే ఒకరికి పడని అక్కాచెల్లెళ్ళ కథ. చిన్నప్పుడు తనకు సోదరి(రెజీనా) వల్ల ఎదురైన దారుణ అనుభవాన్ని దృష్టి పెట్టుకుని వయసొచ్చాక ఆమెను వదిలేసి ఓ అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటుంది అన్య(నివేదిత సతీష్). ఇన్స్ టాలో యువతను ఆకట్టుకునేలా పలు అంశాల మీద వీడియో ట్యూషన్లు చెప్పడం ఆమె వృత్తి. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న తన ఫ్లాట్ లో దెయ్యాలున్న సంగతి ఆమెతో పాటు ఆన్లైన్లో ఫాలో అవుతున్న వాళ్ళకు తెలిసిపోతుంది. తర్వాత కొందరు యువతి యువకులు దారుణంగా చంపబడతారు. అసలు అన్యతో పాటు ఉన్న ఆత్మలు ఎవరివి, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఎలా చనిపోయారనేదే అసలు స్టోరీ.

దర్శకురాలు పల్లవి గంగిరెడ్డి ఇలాంటి కాన్సెప్ట్ ని తీసుకోవడం ఆశ్చర్యం కలిగించినా సస్పెన్స్ ని థ్రిల్ ని మైంటైన్ చేస్తూ భయపెట్టిన తీరు బాగానే సాగింది. మధ్యలో అవసరం లేని ల్యాగ్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాని థీమ్ గా తీసుకుని, దాని ద్వారా పాత్రల మధ్య సంబంధాన్ని ఎస్టాబ్లిక్ చేసి కొత్త తరహాలో ఆలోచించడం ఈ తరహా కథలు ఇష్టపడే వాళ్ళను ఓ మోస్తరుగా మెప్పిస్తుంది. అక్కడక్కడా ఫార్వార్డ్ బటన్ కు పని చెబుతూ చూసేస్తే టైం పాస్ కి ఢోకా లేదు. మొత్తం ఎపిసోడ్లు కలిపి మూడు గంటలకు కాస్త ఎక్కువగా ఉండటం రిలీఫే. రెజీనా కన్నా ఎక్కువ నివేదిత సతీష్ హై లైట్ అయ్యింది. మొత్తానికి ట్యుటోరియల్ పేరుతో భయపెట్టిన అన్యని పరిమిత అంచనాల మధ్య లుక్ వేయొచ్చు.