తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ హిట్ సినిమా ఏదైనా దానికి సినీ ఎడిటర్ గా వ్యవహరించే గౌతమ్ రాజ్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారు. ఆయన జీవితాన్ని దేవుడు అర్థాంతరంగా ‘ఎడిట్’ చేసిన వైనం సినీ పరిశ్రమకు షాకింగ్ గా మారింది. గడిచిన కొంతకాలంగా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న ఆయన.. సినిమా ఇండస్ట్రీలో ఏకంగా 850లకు పైగా సినిమాలకు ఎడిట్ చేసిన ఘనత ఆయన సొంతం. దర్శకుడు తీసిన సినిమా కుప్పను.. అందంగా ఒక పద్దతిగా పేర్చే నైపుణ్యంలో గౌతమ్ రాజ్ కు మంచి పేరుంది.
68 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో 68 ఏళ్ల వయసు పెద్దదేం కాదు. తెలుగు మాత్రమే కాదు.. హిందీ.. తమిళం.. కన్నడ సినిమాలకు సైతం సినీ ఎడిటర్ గా పని చేసిన ఆయన కెరీర్ లో పలు సూపర్ హిట్ సినిమాలకు పని చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది చిత్రానికి ఉత్తమ ఎడిటర్ గా నంది పురస్కారం పొందిన ఆయన కెరీర్ లో బోలెడన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
గబ్బర్ సింగ్.. కాటమరాయుడు.. ఖైదీ నెంబరు 150.. కిక్.. రేసుగుర్రం.. గోపాల గోపాల.. అదుర్సు.. బలుపు.. రచ్చ.. ఊసరవెల్లి.. బద్రీనాథ్.. మిరపకాయ్.. డాన్ శ్రీను.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పని చేసిన సినిమాల పేర్లే కొన్ని పేజీలుగా ఉంటుంది. టాలీవుడ్ లో ప్రముఖ హీరోలకు చెందిన సినిమాలకు ఆయన పని చేశారు. ప్రముఖ హాస్య దర్శకుడు జంధ్యాల తొలిసారి దర్శకుడిగా వ్యవహరించిన నాలుగు స్తంభాలాట చిత్రంతో గౌతం రాజు ఎడిటర్ గా తన కెరీర్ ను షురూ చేశారు.
1954 జనవరి 15న ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించిన ఆయన.. సినీ రంగంలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలో పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవటంతో పాటు.. సినీ అభిమానులు ఎందరో నేరుగా ఆయన్ను గుర్తించే ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన మరణ వార్త విన్నంతనే టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates